మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్ : మరికాసేపట్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతోంది. తొలి అర్ధ గంటలో పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. 119 నియోజకవర్గాలకు గానూ 1821 మంది అభ్యర్థులు బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న జరిగిన పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. లెక్కింపునకు 3,356 సిబ్బంది ఓట్ల లెక్కింపులో 1,916 మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో 3,356 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు రజత్‌కుమార్ తెలిపారు. 20 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటుండగా, మరో 20 వేల మంది ఎన్నికల సిబ్బంది ఉంటారని చెప్పారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు మొత్తం 40 వేల మందిని వినియోగిస్తున్నామన్నారు. స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ పరిసరప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రాజకీయపార్టీల ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌లోకి ఫోన్లు, కాలిక్యులేటర్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించినట్టు సీఈవో తెలిపారు. ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్లు కౌంటింగ్ పూర్తయ్యేవరకు బయటికి రావడానికి అనుమతించబోమని స్పష్టంచేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పొగ తాగరాదని తెలిపారు.

Related Stories: