గ్రేటర్‌లో డైనోసార్ థీమ్ పార్కు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మహానగర ప్రజలను మిలియన్ సంవత్సరాల కిందకు తీసుకుపోనున్నది. భూమిపై డైనోసార్లు నడయాడిన ఘటనలను, భయభ్రాంతులను కలిగించిన సందర్భాన్ని గుర్తు చేసుకునేలా చేస్తుంది డైనో వరల్డ్. పిల్లలకు వింతైన అనుభవం కలిగించి, ఆడించి, పాడించి, వారిని ఆనంద డోలికల్లో ముంచెత్తేలా చేసే డైనోసార్ థీమ్ పార్కు ఇది. పిల్లలు ఎగిరేలా, గంతులేసేలా, గిలిగింతలు పెట్టేలా చేసే పార్కు మొట్టమొదటిసారి మహానగర పరిధుల్లోకి వచ్చింది. పెద్దపెద్ద భారీ ఆకారంలో గల శాకాహార, మాంసాహార డైనోసార్లతో పరిగెత్తేలా, వాకింగ్ చేసేలా, వాటితో ఫైటింగ్ చేసేలా పార్కును తీర్చిదిద్దారు. మొదటిసారిగా యానిమెట్రానిక్స్ నేపథ్యంలో డైనోసార్స్‌ను తీర్చిదిద్దారు. డైనోసార్లు వాకింగ్ చేస్తాయి.. అరుస్తాయి.. ఫైటింగ్ చేస్తాయి..పిల్లలను వాటిపై ఎక్కించుకుని తిరుగుతాయి... పరుగెత్తుతాయి. పిల్లలు, పెద్దలకు ఈ తరహా పార్కు ఒక ప్రత్యేక సంబరాన్ని, సరదాను కలిగించనున్నది. పిల్లలను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసేలా పార్కుడ సంవత్సరం పాటు శ్రమించి ఆరు ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. ఇందులో మొత్తం 30నుంచి 35 వరకు డైనోసార్లు ఉన్నాయి. హైదరాబాదీ పారిశ్రామికవేత్తల కృషి డైనో వరల్డ్ అనే ఏకైక భావనను హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు పారిశ్రామికవేత్తలు వృద్ధిలోకి తెచ్చారు. డైనోసార్స్ థీమ్ పార్కును నిర్మించడానికి నగరానికి చెందిన ప్రశాంత్ మొటాడూ, అభినవ్ పాములపర్తి, సుశాంత్ గౌర్నేనిలు ఏడాది పాటు కృషి చేశారు. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ వ్యాప్త వినూత్న అనుభవాన్ని అందించేందుకు, వింతైన సంబరాన్ని తెచ్చేందుకు వీరు ఎంతగానో కృషి చేశారు. ప్రవేశ రుసుము, వగైరాలు ... డైనో వరల్డ్ పార్కు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కొనసాగుతుంది. పార్కులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ రూ.300 రుసుము ఉంటుంది. అందులోని స్విమ్మింగ్‌పూల్‌లో ప్రవేశానికి మరో రూ.200, డైనోసార్లపై రైడింగ్‌కు రూ.100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బయటి ఆహార పానియాలకు పార్కులోకి అనుమతి లేదు. బర్త్ డే ఇతరత్రా పార్టీలకు ప్రత్యేక చార్జీలను వసూలు చేస్తారు.

Related Stories: