కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు స్క్రాప్‌కే..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆర్టీసీలో పాత బస్సులకు కాలం చెల్లింది. ఇక నుంచి కాలపరిమితి ముగిసిన బస్సులను స్క్రాప్‌గా పరిగణించనున్నారు. గతంలో పాత బస్సులను తిప్పడం ద్వారా ప్రమాదాలతోపాటు డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్నది. ఆర్టీసీ ఇమేజ్ కూడా దెబ్బతింటున్నది. పాత బస్సుల్లో ఎక్కడానికి ప్రయాణికులు కూడా ఆసక్తి కనబర్చకపోవడంతో ఎలాగైనా వీటిని పక్కకు పెట్టాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వరుసగా జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదాలతో రవాణా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల ఆర్టీసీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పాత బస్సుల వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పాత బస్సులు తీసేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. నగరంలో తిరుగుతున్న చాలా బస్సుల్లో పాత బస్సులు ఉన్నాయి. వీటిపై చర్చ జరుగగా కాలపరిమితి ముగిసిన బస్సులను పక్కకు పెట్టాల్సిలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ ప్రస్తావించారు. 15 ఏండ్లు గానీ, 35.5 లక్షల కిలోమీటర్లు గానీ తిరిగిన బస్సులను రోడ్డెక్కకుండా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో ఏది మొదలు పూర్తయితే దాని ప్రకారం షెడ్డుకు తరలించి స్క్రాప్ చేస్తారు.

Related Stories: