జూలో చిలుకలకు ప్రత్యేక పార్కు

- నిర్మాణ పనులకు ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రశాంత్‌కుమార్‌ఝా శంకుస్థాపన చార్మినార్ : జంతు జాలానికి దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జూ మరోసారి జాతీయ స్థాయిలో తన గుర్తింపును చాటనున్నదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రశాంత్‌కుమార్‌ఝా తెలిపారు. గురువారం జూలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న చిలుకల పార్కు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ జులాజికల్ పార్కు ఇప్పటికే దేశంలోనే అరుదైన జూగా గుర్తింపు సాధించిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం చేపట్టబోతున్న చిలుకల పార్క్ వల్ల మరోసారి తన ఘనతను చాటి చెప్పబోతుందన్నారు. జూ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించుకుని అందుకు అనుగుణంగా జంతుజాల ఎన్‌క్లోజర్ల విస్తరణ పనులను చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అనేక రకాల చిలుకతో కూడిన ఎన్‌క్లోజర్‌ను జూలో సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. సందడి చేస్తున్న జిరాఫీలు గత నెల కోల్‌కత్తా నగరం నుంచి తీసుకొచ్చిన జిరాఫీల జంటను సందర్శకులు తిలకించడానికి అందుబాటులోకి తెచ్చారు. జిరాఫీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎన్‌క్లోజర్‌లోకి చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ వాటిని విడుదల చేశారు. సందర్శకులను ఆకర్షించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే జూలో ఓ జిరాఫీకి తోడుగా మరో రెండు జిరాఫీలు చేరాయని తెలిపారు. నగరంలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జీవవైవిధ్యాన్ని మరింత పెంచడానికి నగరంలోని జూ వాతావరణం సహకరిస్తుందన్నారు. ఇక్కడి సమశీతోష్ణస్థితుల వల్ల జంతుజాలం మనుగడ సాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ దేశంలోని ఇతర జూల నుంచి మరిన్ని జంతుజాలాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్‌తోపాటు మునీంద్ర, అదనపు కన్జర్వేటర్ శోభ, డోబ్రైల్, స్వర్గం శ్రీనివాస్, సిద్ధానంద్ కుకీర్తి, జూ క్యూరేటర్ క్షిజా, తిరుతపయ్య, శంకరన్, సుభద్రదేవి, సయ్యద్ మక్సూద్ మోహినుద్దీన్, డాక్టర్ హకీం, శంభులింగం, సయ్యద్ అసదుల్లా, జ్ఞానేశ్వర్, భవానీశంకర్, నాగరాజు, అనిత, భూమ లక్ష్మీదేవి కున్వర్, సరోజా, సందీప్, లక్ష్మీనారాయణ, హనీఫుల్లా పాల్గొన్నారు.

Related Stories: