పీవీఎన్‌ఆర్‌పై వన్ సైడ్ రోడ్డు బంద్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ నెల 22వ తేదీ నుంచి ఒక వైపు రోడ్డును పూర్తిగా మూసేస్తున్నారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గంలో రోడ్డు మరమ్మతు పనులను చేపడుతుండడంతో ట్రాఫిక్ అధికారులు ఆంక్షలను విధించారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రస్తుతం ఉన్న రోడ్డును తొలిగించి బీటీ(బ్లాక్ టాప్) రోడ్డును వేస్తున్నారు. దీంతో ఈ పనులు పూర్తయ్యే వరకు ఒక వైపుగా శంషాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఈ ఆంక్షలను పరిశీలించుకుని ప్రయాణం సాగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్ కోరారు. ఆంక్షలు ఇలా ఉన్నాయి. - విమానాశ్రయం, శంషాబాద్ నుంచి వచ్చే వాహనదారులు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ర్యాంపు ఎక్కకుండా అరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలీ, మెహిదీపట్నం మీదుగా నగరంలోకి వెళ్లాలి. - చాంద్రాయణగుట్ట, జూ పార్క్‌రోడ్డు, శివరాంపల్లి నుంచి వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, హైదరాబాద్ వైపు రావాలంటే పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింద నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్ రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలీ, మెహిదీపట్నంకు చేరుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Related Stories: