నేడు ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల!

హైదరాబాద్: జిల్లా ఓటర్ల జాబితా ముసాయిదాను ఇవాళ విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఈ నెల 10న ముసాయిదా విడుదల చేసి 25వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి తగు నోటీసులు జారీ చేసిన ఆనంతరం అక్టోబరు 4వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే నెల 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు వివరించారు. ఓటర్ల జాబితా సవరణ, ఇతర ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు, ఓటర్ల నమోదు అధికారులతో ఆదివారం కమిషనర్ దానకిశోర్ సమావేశాన్ని నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ హరిచందన, ఎన్నికల విభాగం అధికారి కెనడి, జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, రఘుప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ 2018 జనవరి ఒకటో తేదీ ప్రాతిపదికన ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నామని తెలిపారు. జిల్లాలో 3, 861 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు హాజరవుతారని వివరించారు. బీఎల్‌వోలుగా నియమితులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది విధిగా హాజరు కావాలని, ఎన్నికల విధులకు గైర్హాజరయితే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని, ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దన్నారు. నేటి నుంచి ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరికీ సెలవులను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే బీఎల్‌వోలు, ఫార్మ్ 6, 7, 8, 8ఏలను సరిపడా కలిగి ఉండాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇండ్లను సంబంధిత ఈవోలు, ఎల్‌ఈఆర్వోలు స్వయంగా సందర్శించి ఓటర్ల జాబితాను తనిఖీ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. తమ పరిధిలోని పోలింగ్ బూత్‌లు, ఓటర్ల వివరాలు, సిబ్బంది, కనీస సౌకర్యాల కల్పన తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని కలిగి ఉండాలని ఎన్నికల అధికారులకు దానకిశోర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు.. మంచినీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, హెల్ప్‌డెస్క్, సైన్‌బోర్డులు ఉండేలా ఇప్పటి నుంచే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ర్టానికి గుండెకాయలాంటి హైదరాబాద్ నగరంపై అందరి దృష్టి ఉంటుందని, ఈ నేపథ్యంలోనే ఎన్నికల విషయాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 11, 12వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం నగరంలోని పోలింగ్ కేంద్రాలను, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసే అవసరం ఉందని కమిషనర్ చెప్పారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు చదివి, వాటిని పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం స్పష్టమైన లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ దినోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశం హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా సవరణపై నేడు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణపై పార్టీలకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్బులను ఏర్పాటు చేయాలని అధికారులకు కమిషనర్ దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు.

Related Stories: