హైదరాబాద్ హౌసింగ్ హవా

-ప్రతికూల పరిస్థితుల్లోనూ భాగ్యనగర రియల్టీ ఆకర్షణీయం -2013 నుంచి 26 శాతం పుంజుకున్న ఇండ్ల ధరలు -విభజన తర్వాత రాజకీయ సుస్థిరత.. వెల్లడించిన అనరాక్ ప్రాపర్టీ తాజా నివేదిక
అత్యంతవేగంగా మెగా సిటీగా మారుతున్న హమారా షహర్ హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు గత ఐదేండ్లలో 26 శాతం పెరిగాయి. ఐటీ రంగ హబ్‌గా, హాయిగా జీవించడానికి మిక్కిలి అనువైన నగరంగా ఇప్పటికే రికార్డులకెక్కిన భాగ్యనగరం రింగ్‌రోడ్డుతో నలువైపులా విస్తరిస్తూ మిగతా నగరాల కన్నా ముందున్నదంటూ ఆనరాక్ సంస్థ నివేదిక ఇచ్చింది.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నిర్మాణ రంగం దూసుకెళ్తున్నది. 2013 నుంచి భాగ్యనగరంలో ఇండ్ల ధరలు 26 శాతం పుంజుకున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఆందోళనల మధ్య కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కున్న డిమాండ్ చెక్కుచెదరలేదని తమ తాజా నివేదికలో అనరాక్ చెప్పింది. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణలు కూడా కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని నింపాయి. జనాభాపరంగా పెద్దదైన, ఐటీ-ఐటీ అనుబంధ రంగాలకు కొలువైన హైదరాబాద్.. అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. ఔటర్ రింగ్ రోడ్డు ఈ మహా నగరానికి కలిసొచ్చింది. ఇతరత్రా మౌలిక వసతుల కల్పన కూడా ఆకర్షణీయంగా ఉన్నది అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తమ నివేదికలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు ముందున్న ఆందోళనకర పరిస్థితులు పూర్తిగా కనుమరుగైపోయాయని, కొత్త ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగానికి ఎన్నో ప్రయోజనాలు లభించాయన్నారు. ప్రధానంగా ఈ రెండేండ్ల కాలంలో హైదరాబాద్ నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పారు.

టీ హబ్‌తో డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధిపరుచడం, ఇక్కడి యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుచడంతో దేశ, విదేశీ ఐటీ రంగ సంస్థలు భాగ్యనగరానికి క్యూ కడుతున్నాయి. ఇది స్థానికంగా భూముల ధరలను పెంచేసింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలకు ఎక్కడలేని డిమాండ్‌ను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే 2012-17 మధ్య మార్కెట్ 5 శాతం వృద్ధి చెందగా, ధరలు 26 శాతం పెరిగాయని అనరాక్ వివరించింది. అమ్మకాలు కూడా 2016తో పోల్చితే 2017లో 21 శాతం ఎగబాకాయి. ఐటీ నిపుణుల రాకతో లగ్జరీ మార్కెట్ కూడా విస్తరించింది. ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో అమ్ముడుకాని ఆస్తులు తక్కువేనని అనరాక్ స్పష్టం చేసింది. 2016 రెండో త్రైమాసికంలో 35,560 యూనిట్లుగా ఉన్న అమ్ముడవ్వని ఇండ్లు.. 2017 రెండో త్రైమాసికం నాటికి దాదాపు 14 శాతం తగ్గాయన్నది. ఈ ఏడాది జూన్‌కల్లా మరో 13 శాతం తగ్గిపోయినట్లు చెప్పింది. మొత్తంగా ఈ జూన్‌తో ముగిసిన రెండేండ్ల కాలంలో నిర్మాణమైనా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఇండ్లలో సుమారు 29 శాతం అమ్ముడైపోయాయని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు భేష్

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రాజకీయ సుస్థిరత హైదరాబాద్ గృహ నిర్మాణ రంగాభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో కొలువుదీరిన నూతన సర్కారు అవలంభించిన విధానాలతో మరింత బలం చేకూరిందని అనరాక్ ఈ సందర్భంగా పేర్కొన్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిందని, ఇది ఇండ్ల గిరాకీని ఒక్కసారిగా పెంచేసిందని తెలిపింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల కోసం ఆన్‌లైన్ క్లియరెన్స్ వ్యవస్థను తీసుకురావడంతోపాటు యువ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందడం, నివాస వ్యయం తక్కువగా ఉండటం, జీవన ప్రమాణాలు బాగుండటం, కావాల్సినంత భూ వనరులు, నైపుణ్యానికి కొదవే లేకపోవడం వంటివి హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అత్యంత ఆవాసయోగ్య ప్రాధాన్య ప్రాంతంగా మార్చాయని అనుజ్ పురి అన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పారదర్శక నిర్ణయాల వల్లే రెసిడెన్షియల్ ప్రాపర్టీల విలువ గణనీయంగా పెరిగిందని, పెట్టుబడులూ పుంజుకున్నాయని చెప్పారు.