ఐటీ అడ్డా హైదరాబాద్

-ఆసియా దేశాల సర్వేలో ఆకట్టుకున్న భాగ్యనగరం.. -టెక్నాలజీ సంస్థల ప్రారంభం, విస్తరణకు అనువైనదిగా గుర్తింపు -దేశంలో బెంగళూరు తర్వాతి స్థానం మన రాజధానిదే.. -పన్నులు, జీవన వ్యయం తక్కువని కొల్లియర్స్ ఇంటర్నేషనల్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: హైదరాబాద్.. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న నగరం. అందరికీ చేరువైన ప్రాంతం. సకల సదుపాయాలకూ నిలయం. అందుకే మన భాగ్యనగరం ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్నది. దేశ, విదేశీయులను అమితంగా ఆకట్టుకుంటున్నది. తాజాగా విడుదలైన ఓ అధ్యయనంలోనూ రాష్ట్ర రాజధాని తన సత్తాను చాటింది. నిర్మాణ రంగ సేవలు, పెట్టుబడుల నిర్వహణ సంస్థయైన కొల్లియర్స్ ఇంటర్నేషనల్ ఆసియాలో అత్యంత అనువైన ప్రాంతాలు: టెక్నాలజీ రంగం పేరిట రూపొందించిన పరిశోధన నివేదికను బుధవారం విడుదల చేసింది. సామాజిక, ఆర్థిక, ఆస్తులు, మానవీయ కారణాలు అనే అంశాల ప్రాతిపదికన దీన్ని తయారు చేసింది. ఇందులో టెక్నాలజీ సంస్థలు తమ కార్యకలాపాల ప్రారంభానికి, విస్తరణకు హైదరాబాద్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నాయని తేలింది. దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌పైనే టెక్కీలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆసియా దేశాల్లోని మొత్తం 16 మహా నగరాలతో ఈ నివేదిక రూపొందగా, బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు 7వ స్థానం దక్కగా, ముంబై 10, ఢిల్లీ-ఎన్‌సీఆర్ 11వ స్థానాల్లో ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రాచూర్యం కలిగిన బెంగళూరు.. ఐటీ నైపుణ్యం, సామాజిక, ఆర్థికపరమైన అంశాల్లో బలంగా ఉందని కొల్లియర్స్ అభిప్రాయపడింది. గడిచిన మూడేండ్లకుపైగా కాలంలో సగటున ఏటా 4 బిలియన్ డాలర్ల స్టార్టప్ పెట్టుబడులను బెంగళూరు అందుకున్నదంటూ.. 2022 నాటికి ఆసియాలో అత్యంత వృద్ధిదాయక నగరంగా ఉంటుందన్నది. ఇక జాబితాలో సింగపూర్ రెండో స్థానంలో, షెన్జెన్ (చైనా) మూడో స్థానంలో ఉండగా, బీజింగ్, హాంకాంగ్, టోక్యో, తైపీ తదితర నగరాలకూ చోటు లభించింది. అన్ని నగరాల కంటే ఎక్కువగా బెంగళూరుకు 67.9 శాతం మార్కులు పడ్డాయి. సింగపూర్‌కు 62.6 శాతం, షెన్జెన్‌కు 60.9 శాతం ఓటింగ్ రాగా, హైదరాబాద్‌కు 59.3 శాతం పోలైయ్యాయి. 60 నుంచి 50 శాతం మధ్య స్కోర్లను మిగతా నగరాలు అందుకున్నాయి.

ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ

దేశంలోనే ధనిక రాష్ట్రంగా పేరున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అవలంభించిన విధానాలు తెలంగాణ ప్రగతిని పరుగులు పెట్టించాయి. పన్నుల్ని తగ్గించడంతోపాటు జీవన వ్యయాన్ని అదుపులో పెట్టడంతో ఐటీ రంగం.. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విస్తరించింది. కావాల్సినన్ని భూ వనరులకుతోడు, రోడ్డు, విమాన, రైలు రవాణా వ్యవస్థలు ప్రభావవంతంగా ఉండటం, మెరుగైన ఔటర్ రింగ్ రోడ్డు సౌకర్యాలు నగరం రూపురేఖల్నే మార్చేశాయి. మానవీయ కారణాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ రేటింగ్ ఎంతో బాగుందన్న తాజా సర్వే.. ఇక్కడ పన్ను రేట్లు, జీవన వ్యయం కూడా చాలా తక్కువని స్పష్టం చేసింది. దీంతో టెక్నాలజీ రంగ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ముందుకొస్తున్నాయి. ఫలితంగా ఆఫీస్ మార్కెట్ బలపడి రియల్ ఎస్టేట్ రంగం జోరందుకున్నది. ఈ పరిణామం హైదరాబాద్ శివారు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడటమేగాక వరంగల్, కరీంనగర్ వంటి పొరుగు జిల్లాలనూ ఐటీ-హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించింది.

ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే..

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కండ్ల ముందు అనేక సవాళ్లు.. కలల్ని సాకారం చేసుకోవాలన్న తపన.. కఠిన లక్ష్యాల సాధన.. తెలంగాణ తొలి ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగు రాష్ట్ర ప్రగతికి అద్దం పట్టేదే. దాదాపు నాలుగున్నరేండ్ల పాలనలో నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ బిడ్డల స్వరాష్ట్ర ఆకాంక్షకు అర్థం.. పరమార్థం చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతాలనే సృష్టించాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేస్తూ చేపట్టిన చర్యలు గొప్ప సత్ఫలితాల్నే ఇచ్చాయి. దేశ, విదేశాల్లోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో ఇప్పుడు హైదరాబాద్‌లో కార్యాలయాలు లేని సంస్థలే లేవంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. సీఎం కేసీఆర్ ఆశయాలకు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఆలోచనలూ తోడవడం.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టాయి. టీ-హబ్ పేరుతో ఔత్సాహికులను ప్రోత్సహించడంతోపాటు ప్రపంచ శ్రేణి సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి పెట్టుబడులను ఆకర్షించడంలో కేటీఆర్ సఫలీకృతులయ్యారు. నూతన సంస్థల ఏర్పాటుకు వేగవంతమైన అనుమతులూ కలిసొచ్చాయి.