కంటి శస్త్రచికిత్సల్లో ఇకపై సరికొత్త విప్లవం

లండన్ : సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. అలాంటి ముఖ్యమైన కంటిలో కార్నియా పొరది కీలక పాత్ర. ఈ కార్నియా పొర దెబ్బతినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మంది చూపును కోల్పోయారు. వారికి తిరిగి చూపు రావాలంటే మరణించినవారి కండ్ల నుంచి కార్నియాను తీసి అమర్చడం తప్ప మరో మార్గం లేదు. అయితే సరిపడా కార్నియా దొరుకక లక్షలాది మంది అవస్థలు పడుతున్నారు. అలాంటివారందరికీ బ్రిటన్ శాస్త్రవేత్తలు తీపికబురు అందించారు. బ్రిటన్‌లోని న్యూకాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు 3డీ బయో ప్రింటర్ల సాయంతో ప్రయోగశాలలో కార్నియాను ముద్రించారు.

ఆరోగ్యవంతమైన వ్యక్తి కార్నియా నుంచి మూల కణాలను సేకరించి, వాటికి ప్రత్యేక బయో ఇంక్‌ను కలిపి 3డీ బయోప్రింటర్‌లో పోసి కార్నియాను ముద్రించారు. వీటి ముద్రణకు సాధారణ 3డీ ప్రింటర్లు సరిపోతాయని, కేవలం పదినిమిషాల్లోనే కార్నియాను ముద్రించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మానవ కణాలను ప్రయోగశాలల్లో పెంచి, వాటి నుంచి వేరుచేసిన జీవపదార్థాలనే బయోఇంక్ అని పిలుస్తారు. దీనిని మానవ కణజాలాలు లేదా అవయవాలు ముద్రించే 3డీ ప్రింటర్లలో వాడుతుంటారు.

బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ బయోఇంక్‌కు ఆల్గినేట్, కొల్లాజన్ వంటి పదార్థాలను కలిపి ప్రత్యేక జీవ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీనివల్ల కార్నియా రూపం చెడిపోకుండా, మూల కణాలు చనిపోకుండా కాపాడుతుందని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన చే కెన్నాన్ తెలిపారు. వీరి పరిశోధనా వ్యాసం ఎక్స్‌పరిమెంటల్ ఐ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Related Stories: