వేములవాడలో కాంగ్రెస్‌కు భారీ షాక్

వేములవాడ, : వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ విద్యార్థి నాయకునిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏనుగు మనోహర్‌రెడ్డి 25 ఏళ్లుగా సేవ చేస్తూ వస్తున్న తగిన గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. నియోజకవర్గంలో దాదాపు 500 మందితో కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబు సమక్షంలో ఏనుగు మనోహర్ రెడ్డి అనుచరగణంతో అయన పార్టీలో చేరగా కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇక విద్యార్థి నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన మనోహర్‌రెడ్డి ఎన్‌ఎస్‌యూఐ, మండలశాఖ అధ్యక్షులుగా కాంగ్రెస్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన యువజన కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ పార్టీలోనూ ప్రధాన భూమికను పాత్రను పోషించారు.

ప్రస్తుతం టీపీసీసీ కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తున్న ఆయన వేములవాడ సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్, వేములవాడ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూడ పనిచేశారు. గడిచిన ఆరేడేళ్లుగా చురుకైన నాయకుడిగా పనిచేస్తూ వస్తున్నారు. వేములవాడ కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తూ వచ్చిన మనోహర్‌రెడ్డి, 2014లో ఇతరులకు కేటాయించినా ఆయన పార్టీని పట్టుకోని పనిచేశారు. ప్రస్తుత పరిణామాల్లో ఆయన పార్టీ టికెట్‌ను ఆశించినా ఫలితం లేకపోవడంతో అనుచరగణంతో పాటు కార్యకర్తలతో సమావేశమైన ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయన వేములవాడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 25 ఏళ్లుగా పార్టీకి ఎనలేని సేవచేశానన్నారు. విద్యార్థిని నాయకున్ని నుంచి తన ప్రస్థానం ప్రారంభం కాగా నిష్పక్షపాతంగా పార్టీ కోసం పనిచేసినా తగిన గుర్తింపు లేదన్నారు.

2014లో టికెట్‌ను ఆశించినా గడిచిన నాలుగున్నార సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఢిల్లీకి పంపిన లిస్ట్‌లో తన పేరు లేకపోవడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, జిల్లా మంత్రి కేటీర్, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబు సూచనలతో నడుచుకుంటూ అభివృద్ధిలో భాగస్వామమై ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. అనంతరం వారు దాదాపు 200 వాహనాల్లో పట్టణంలో నుంచి భారీ ర్యాలీగా హైదరాబాద్ తరలివెళ్లారు. వేములవాడ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆయన వెంట తరలి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Related Stories: