జిల్లాకో భారీ బహిరంగసభ

-ప్రత్యర్థులు ఖరారయ్యేనాటికే టీఆర్‌ఎస్ తొలిదశ ప్రచారం పూర్తిచేయాలి -అభ్యర్థులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పక్కా మార్గదర్శకాలు -పార్టీ అభ్యర్థులతో కలిసిపోయిన అసంతృప్త నాయకులు -ఇప్పటికే నియోజకవర్గాలకు చేరిన మొదటి విడుత ప్రచార సామగ్రి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యర్థులకు అందనంత వేగంతో ప్రచారంలో దూసుకుపోతున్నది. ముందస్తుగానే 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. పక్షం రోజులుగా ప్రచారంతో దుమ్మురేపుతున్నారు. అభ్యర్థుల ప్రచార సరళిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న సీఎం కేసీఆర్.. వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఖరారయ్యే నాటికి మొదటిదశ ప్రచారాన్ని పూర్తిచేయాలని టీఆర్‌ఎస్ అధినాయకత్వం అభ్యర్థులకు సూచించింది. అక్టోబర్ మొదటివారం నుంచి ప్రజా ఆశీర్వాదసభలను నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. దసరా నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో జిల్లాస్థాయిలో భారీ బహిరంగసభలు ఏర్పాటుచేసే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలిసింది.

ఎన్నికల షెడ్యూల్ వచ్చాక నియోజకవర్గస్థాయిలో ప్రతిరోజూ మూడు నాలుగు సభలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. టిక్కెట్లు రాకపోవటంతో అసంతృప్తికి గురైన నాయకులకు భవిష్యత్‌లో సముచిత గుర్తింపు, ప్రాధాన్యం ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో వారంతా అభ్యర్థులతో కలిసి ప్రచారంలో మమేకమవుతున్నారు. పోటీచేసే అర్హతలు ఉన్నా.. అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని చెబుతూ వారు పార్టీ అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొనేలా మంత్రి కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులకు సర్దిచెప్పడం పూర్తయింది. ఇదిలాఉండగా, పార్టీ అభ్యర్థులకు అవసరమైన మొదటి విడుత ప్రచార సామగ్రి ఇప్పటికే నియోజకవర్గాలకు చేరింది.

గడపగడపకూ గులాబీ జెండా..

ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నివర్గాల ప్రజలు, ప్రభుత్వ లబ్ధిదారులందరినీ కలిసేలా పార్టీ అధినాయకత్వం అభ్యర్థులకు సూచనలు చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వారికి గుర్తుచేయాలని నేతలు సూచిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేండ్ల కాలంలో వందల పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల లబ్ధిదారులు ప్రతిగ్రామంలోనూ వందలు, వేలసంఖ్యలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నలభై లక్షల మందికి ఆసరా పింఛన్లు, యాభై లక్షల మందికి రైతుబంధు, నాలుగు లక్షల మందికి పైగా కల్యాణలక్ష్మి , షాదీముబారక్, మూడున్నర లక్షలకుపైగా కేసీఆర్ కిట్ల లబ్ధిదారులు, గొర్రెలు పంపిణీ పథకం కింద దాదాపు ఎనిమిది లక్షల కుటుంబాలు ఉన్నాయి.

వీటితోపాటు, ఇతర అనేక పథకాల ద్వారా లబ్ధిపొందినవారు ప్రభుత్వానికి తమ కృతజ్ఞతను తెలుపడానికి సిద్ధంగా ఉన్నారని, పార్టీ అభ్యర్థి వ్యక్తిగతంగా వారిని కలిసి విజ్ఞప్తిచేస్తే ఆ ఓట్లన్ని టీఆర్‌ఎస్‌కే వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 90 శాతానికిపైగా అభ్యర్థులను ప్రకటించడం, వారికి ప్రచారానికి కావాల్సినంత సమయం ఉడటంతో అందరినీ కలువాలని సూచిస్తున్నారు. గడపగడపకూ గులాబీ జెండా పేరుతో ముందుకెళ్లాలని పార్టీ అధిష్టానం సూచించింది.

తెలంగాణ పాట..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ పాట ప్రతిబింబిస్తుంది. అలాంటి తెలంగాణ పాటలకు టీఆర్‌ఎస్ పెట్టింది పేరు. పాటల ద్వారా ప్రభుత్వం చేసిన పథకాలను ఇంటింటా ప్రచారంచేస్తున్నారు. అవకాశమున్నంత వరకు ఎక్కువ బృందాలను ఏర్పాటుచేసుకొని అన్ని గ్రామాల్లో ప్రచారం జరిగేలా చూడాలని అధిష్టానం కూడా సూచిస్తున్నది. కళాబృందాల కోసం కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ప్రచార రథాలను కూడా సిద్ధంచేశారు. మరికొన్నిచోట్ల ధూం ధాం పేరుతో వేదికలు, సభలను ఏర్పాటుచేసి ప్రచారంచేస్తున్నారు. వందమాటల కంటే ఒక పాట తూటలాగా దూసుకుపోతుందనే ఉద్దేశంతో పాటలపైన దృష్టిపెట్టారు. ఉద్యమ సమయంలోని పాటలతోపాటు కొత్తగా రూపొందించిన పాటలను కూడా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.