అర్థ‌రాత్రి 12 గంటల వరకు హోటల్స్ నిర్వహంచుకోవచ్చు...

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రభుత్వం నుండి అధికారికంగా నమోదు చేయించుకుని అనుమతులు పొందిన హోటల్స్‌ను అర్థ‌రాత్రి 12 గంటల వరకు నిర్వహించుకునేలా రాష్ట్ర కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌నా శాఖ మంత్రి పితాని స‌త్యానారాయ‌ణ ఆమోదం తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి పితాని సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోటల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో హోటల్స్ నిర్వహణకు సంబంధించి రాత్రి సమయంలో 10:30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వ‌డం జరిగిందని ఆ స‌మ‌యాన్ని అర్థ‌రాత్రి 12 గంటల వరకు పోడిగించేలా చూడాలని మంత్రిని కోరారు. ఈ సంద‌ర్భంగా పోలీస్, కార్మిక శాఖా అధికారులతో మంత్రి స‌మావేశ‌మై చర్చించారు. అనంతరం మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్స్ మరియు మున్సిపాలిటిలలో ప్రభుత్వం నుండి అధికారికంగా నమోదు చేయించుకుని ప్రభుత్వ అనుమతులు ఉన్న హోటల్స్‌లో రాత్రి 12 గంటల వరకు నిర్వహించుకునేలా మంత్రి ఆమోదం తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతి కార్మికుడి పనివేళలు 8 గంటలకు మించి ఉండకోడదని, వారంలో ఒకరోజు సెలవు రోజుగా ప్రకటించాలనీ, పనివేళలకు మించి పనిచేస్తే ఓటీ కల్పించాలని, రాత్రివేళలో పనిచేసే కార్మికులకు వారికి అనుగుణంగా విశ్రాంతి గదులు కల్పించాలని, మహిళా కార్మికులెవరైన ఉంటే వాళ్ళకు సెక్యూరీటి కల్పించే బాధ్యత హోటల్ యాజమాన్యానిదేన‌ని హోటల్ అసోసియేషన్ సభ్యులకు మంత్రి సూచించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న సందర్బంలో రాత్రి వేళల్లో ఫుడ్‌ కోర్ట్స్ నిర్వహణ‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అనుమతులు కల్పించటం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన జీవోను అధికారికంగా వారం లోపు ఇచ్చేలా చర్యలు తిసుకోవాలని అధికారులను అదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్, విజ‌య‌వాడ డిసీపీ గజరావ్ భూపాల్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.శ్రీనుబాబు, త‌దితరులు పాల్గొన్నారు.

Related Stories: