హార్స్ గ్యాంగ్ లీడర్ అరెస్ట్

హైదరాబాద్ : ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న హార్స్ గ్యాంగ్ లీడర్ హబీబ్ అబ్దుల్ తల్లా అలీ హుద్రూస్‌ను బుధవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 3న రాత్రి 11.00 గంటల ప్రాంతంలో బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లాపూర్ ప్రాంతంలో ఓ యువకుడు కత్తిపోట్లతో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని వైద్య చికిత్స కోసం దవాఖానకు తరలించారు. విచారణలో అతను దాదాపు 16 కేసుల్లో నిందితుడిగా ఉన్న హార్స్‌గ్యాంగ్ లీడర్ హబీబ్ అబ్దుల్ తల్లా అలీ హుద్రూస్ అలియాస్ హబీబ్ తల్లాగా గుర్తించారు. అతను బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన రెండు కేసుల్లో కూడా పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. బుధవారం ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడడంతో అతన్ని అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట పీఎస్‌లో 10, బాలాపూర్ పీఎస్‌లో 2, పహాడీషరీఫ్ పీఎస్‌లో 3 కేసులు అతనిపై నమోదయ్యాయి. గుర్రంపై స్వారీ...కన్నెత్తి చూస్తే దాడి హార్స్ గ్యాంగ్ లీడర్ హబీబ్ తల్లా షాహీన్‌నగర్, ఎర్రకుంట, బార్కా స్, కొత్తపేట్ తదితర ప్రాంతాల్లో రౌడీయిజం చలాయిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడు. ఇటీవల బాలాపూర్ ప్రాంతంలో ఉదయం సమయంలో రోడ్డుపై గుర్రపు స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా... గుర్రం మీద ఉన్న హబీబ్ తల్లా కారును ఢీకొట్టాడు. ఈ విషయంపై నిలదీసిన కారు యజమానిపై దాడికి పాల్పడ్డాడు. మరో కేసులో ఓ జిమ్ ప్రాంతంలో నిలబడ్డ యువకుడిని నీవు నా వైపు ఎందుకు చూస్తున్నావు... పోలీసులకు చెప్పి నన్ను జైల్లో పెట్టిస్తావా అంటూ గొడవకు దిగి అతన్ని తీవ్రంగా గాయపర్చాడు. ఇలా బాలాపూర్ పోలీసులకు హబీబ్ తల్లా వాంటెడ్‌గా మారాడు. చివరకు కత్తిపోట్లతో రోడ్డుపై పడి పోలీసులకు చిక్కాడు. అతనిపై దాడి జరిగిన ఘటనపై కూడా పోలీసులు త్వరలో దర్యాప్తును చేపట్టనున్నారు. అదే విధంగా ఇతనిపై పీడీ యాక్ట్ కూడా విధించే అవకాశం ఉంది.
More in తాజా వార్తలు :