లే అవుట్లకు కొత్త నిబంధనలు

హైదరాబాద్ :రియల్ మోసాలకు ఇక కాలం చెల్లనున్నది. నిబంధనలకు అతిక్రమించి ఇష్టారాజ్యంగా లే అవుట్ నిర్మాణాలు చేపట్టి ప్లాట్ల అమ్మకాలు చేపడుతున్న నిర్మాణ రంగ సంస్థల ఆగడాలకు శాశ్వత చెక్ పడనున్నది. ఈ మేరకు లే అవుట్ నిర్మాణంలో నూతన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగునంగా హెచ్‌ఎండీఏ చర్యలకు ఉపక్రమించింది. ఈ వారంలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. త్వరలోనే నూతన నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చి మోసపూరిత రియల్టర్లపై ఉక్కుపాదం మోపనున్నారు.

అడుగడుగునా ఉల్లంఘనలే

హెచ్‌ఎండీఏ పరిధిలో లే అవుట్ వేయాలంటే చాలా మంది రియల్టర్లు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. వాస్తవంగా లే అవుట్ అనుమతి విషయంలో గ్రామ పంచాయతీకి ఎలాంటి అధికారం లేదు. కానీ ఫోర్జరీ సంతకాలు, పాత తేదీలతో అనుమతులు ఉన్నాయంటూ నమ్మబలికి అమాయక ప్రజలకు అంట గట్టి చేతులు దులుపుకున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల రియల్టర్లు ప్రాథమిక లే అవుట్ అనుమతి తీసుకొని ఫైనల్ లే అవుట్ అనుమతులు తీసుకోకపోవడం, లే అవుట్ అభివృద్ధిని మధ్యలోనే చేతులెత్తేయడం, అనుమతులు పొందే సమయంలో హెచ్‌ఎండీఏకు చూపించినట్లుగా కాకుండా...వాస్తవికంగా మరోలా పరిస్థితులు ఉంచి అడ్డదారి అమ్మకాలు చేపట్టడం, కనీసం నిబంధనల విషయంలో రోడ్లు, నాణ్యతాప్రమాణాలు, ప్రజా అవసరాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ పరిస్థితులన్నింటికీ చెక్ పెడుతూ కమిషనర్ చిరంజీవులు ప్లానింగ్ విభాగం అధికారులు పకడ్బందీ నిబంధనలకు రూపకల్పన చేశారు. వినియోగదారులకు నమ్మకమైన ప్లాట్లు అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం అమలవుతున్న విధానాలకు స్వస్తి పలికి కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనలను పురపాలక శాఖ సెక్రటరీకి నివేదిక అందించనున్నారు. ఇక్కడి నుంచి సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర పొందిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది.

ప్రస్తుత నిబంధనలు

* హెచ్‌ఎండీఏ పరిధిలోని పంచాయతీ భూముల్లో లే అవు ట్లు వేయాలంటే తప్పనిసరి హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకోవాలి. * ఇందుకు నిర్ణీత ఫీజులు, 30 శాతం రహదారులకు మరో 10-15 శాతం ప్రజా అవసరాలకు, మరో 15 శాతం స్థలాన్ని హెచ్‌ఎండీఏ వద్ద తనఖా పెట్టాలి. * నిబంధనల ప్రకారం లే అవుట్‌ను అభివృద్ధి చేస్తే కుదవ పెట్టిన స్థలాన్ని రిలీజ్ చేస్తారు. * ఒకవేళ మధ్యలోనే సదరు రియల్టర్ చేతులెత్తేస్తే హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగి ఈ 15శాతం విక్రయించి ఆ నిధులతో అభివృద్ధి చేస్తుంది. * ఇప్పటి వరకు లే అవుట్లకు ఎండీపీ పరిధిలో 30 ఫీట్ల రోడ్, గ్రోత్ కారిడార్‌లో 40 ఫీట్ల నిబంధన ఉండేది. నూతన నిబంధనలు * రాబోయే రోజుల్లో సంస్థ పరిధిలో లే అవుట్ వేయాలంటే కచ్చితంగా 40 ఫీట్ల రోడ్డు తప్పనిసరి. * ఇక ముందులాగా సంబంధిత లే అవుట్‌లో ఓపెన్ స్పేస్ ఎక్కడ పడితే అక్కడ వదలడం వీలుండదు. లే అవుట్ చివర్లనో, పనికిరానీ ప్రాంతంలో వేయడం అసలే కుదరదు.లే అవుట్‌లో కొనుగోలు చేసిన వినియోగదారులకు చక్కటి ఆరోగ్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. ప్రజా అవసరాలకు వదిలే ఓపెన్ స్పేస్ కచ్చితంగా లే అవుట్ మధ్యలోనే ఉండాలి. దానికి బై నంబరు వేయాలి. తద్వారా గాలి, వెంటిలేషన్ వీలు ఉంటుంది. దాంతో పాటు ఈ స్థలంలో పార్కులు, స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆరోగ్యకరమైన అభివృద్ధి తప్పనిసరి * సరికొత్తగా ఈ సారి లే అవుట్ వేసిన నిర్మాణదారుడు అందులో 20శాతం అమ్మకాలు చేపట్టగానే ప్రత్యేకంగా అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తద్వారా కొనుగోలు చేసిన వారందరికీ మేలు జరుగుతుంది. * లే అవుట్‌లో నాణ్యమైన రోడ్లు వేయడంతో పాటు ఐదు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యత రియల్టర్‌దే * హెచ్‌ఎండీఏలో తొలుత లే అవుట్ అనుమతులు తీసుకొని, మళ్లీ మార్పులు కారణంగా రివైజ్డ్ లే అవుట్‌కు కచ్చితంగా ఎన్‌వోసీ సమర్పించాలి. * 6 సంవత్సరాల లోపు లే అవుట్‌ను అభివృద్ధి చేయకుండా ఉంటే తనఖా పెట్టిన 15శాతం స్థలం విషయంలో హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగి ఈ 15 శాతం విక్రయించి ఆ నిధులతో అభివృద్ధి చేస్తుంది. * గ్రామ పంచాయతీ పరిధిలోని భూములకు కచ్చితంగా హెచ్‌ఎండీఏ మాత్రమే అనుమతులు మంజూరు చేస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే హెచ్‌ఎండీఏ లేఖలు రాసింది.

× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..