మరో సంచలనానికి సిద్ధం: లక్ష్మణ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: కొత్త, పాత క్రికెటర్ల మేళవింపుతో బలంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ఆటగాళ్లను మీడియాకు పరిచయం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్, సీఈవో షణ్ముకం సమక్షంలో జట్టులో చేరిన కొత్త ఆటగాళ్లకు జెర్సీలు అందజేశారు. నటరాజన్, గోస్వామి, సాహా, ఖలీల్ అహ్మద్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, థంపీ, సచిన్ బేబీ, సందీప్, మెహదీ హసన్, స్టాన్‌లేక్, బ్రాత్‌వైట్, షకీబ్ ఈసారి కొత్తగా జట్టులో చేరారు. మరోవైపు జట్టు వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరిస్తాడని మెంటార్ లక్ష్మణ్ తెలిపాడు. గతంలో మా జట్టు అంతా బాగున్నప్పటికీ మిడిలార్డర్ కూర్పు సరిగా లేదు. ఈసారి ఆ లోటును భర్తీ చేసేందుకే ఐపీఎల్ వేలంలో నాణ్యమైన కొత్త ఆటగాళ్లను తీసుకున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నర్లే అని వీవీఎస్ వెల్లడించాడు.