ఓటుకు వచ్చి.. అనంత లోకాలకు

హైదరాబాద్ : ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలిని కారు రూపంలో మృత్యువు కబలించింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంఎస్ మక్తాకు చెందిన యూసుఫ్ బీ(65) శుక్రవారం భారతి స్కూల్ వద్ద పోలింగ్ స్టేషన్ నం. 114 వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. కూతురు అబిదా బేగంతో వచ్చింది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తుండగా, కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఒక్కసారిగా ఓటర్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఎంఎస్ మక్తాకు చెందిన దీపక్ సింగ్(24) ఈ పోలింగ్ బూత్ కొద్ది దూరంలో కారు (టీఎస్ 13 ఈజే 2602) నిలిపాడు. ఆమె వచ్చే తరుణంలో అప్పటికే గేర్ వేసి ఉండటంతో కారును స్టార్ట్ చేశాడు. దీంతో వేగంగా ముందుకు వచ్చి యూసుఫ్‌బీ, ఆమె కూతురు అబిదాబేగం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యూసుఫ్ బీను లక్డీకాపూల్‌లోని వాసవీ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఆమె కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన యూసుఫ్‌బీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. యూసుఫ్ బీ భర్త కొంత కాలం క్రితం మృతిచెందగా, కుటుంబాన్ని కుమారుడు పోషిస్తున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: