ఒకే మండపంలో మొహర్రం, గణేశ్ చతుర్థి వేడుకలు

పొద్దున లేస్తే.. మతాల గొడవలు, కులాల కొట్లాటలను చూస్తుంటాం. కానీ పూణెకు చెందిన వీళ్లు మాత్రం మాకు మతాల, గితాలు జాన్తానై.. మేమంతా ఒకటే అని నిరూపించారు. ఒకే మండపంలో మొహర్రం, గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హిందూ, ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు పూణెలోని కడ్కి రీజియన్‌లో ఇలా ఒకే మండపంలో రెండు మతాలకు సంబంధించిన వేడులకు జరుపుకొని వార్తల్లోకెక్కారు. 1986 తర్వాత రెండు మతాలకు చెందిన ఈ పండుగలు ఒకే సారి జరుగడంతో ఇరు మతాల వాళ్లు ఒకే మండపంలో వేడుకల జరుపుకున్నారు. కడ్కిలో గత 94 ఏండ్ల నుంచి మద్లా బజార్ మిత్రా మండల్ ఆధ్వర్యంలో గణేశ్ చతుర్థిని నిర్వహిస్తున్నారట. 115 సంవత్సరాల నుంచి పైల్వాన్ తజియా కడ్కి ఆధ్వర్యంలో మొహర్రం వేడుకలు జరిగేవి. ఇలా ఒకే మండపంలో రెండు మతాలు కలిసి వేడుకలు జరుపుకోవడంతో ఆ మండపాన్ని చూడటానికి భారీగా హిందూముస్లింలు తరలివచ్చారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ మతసామరస్యాన్ని చాటారు. ఈసారి మొహర్రం, వినాయక చవితి ఒకేసారి వస్తున్నాయని తెలిసి.. హిందూముస్లింలంతా రెండు నెలల ముందే ప్లాన్ చేసి అన్నీ అరేంజ్ చేసుకున్నారట. 1984, 1985, 1986 సంవత్సరాల్లో కూడా ఇలాగే రెండు పండుగలు ఒకేసారి రావడంతో అప్పుడు కూడా ఒకే మండపంలో వేడుకలు నిర్వహించారట. 1986 తర్వాత మాత్రం మళ్లీ ఇప్పుడే రెండు పండుగలు ఒకేసారి రావడంతో మళ్లీ తమ సోదరభావాన్ని వాళ్లు ఇలా చాటుకున్నారు.

Related Stories: