పసిడికి పెరుగనున్న డిమాండ్

-ద్వితీయార్ధంలో 25 శాతం పెరిగే అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్‌లో పసిడికి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సంవత్సరం ద్వితీయార్ధంలో బంగారానికి డిమాండ్ 25 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పెంచడంతో రైతులు అతి విలువైన లోహాల కొనుగోలుకు మొగ్గుచూపే అవకాశం ఉన్నదని ఈ సర్వేలో తెలిపింది. ప్రపంచంలో పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో ప్రతియేటా 800-900 టన్నుల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో రెండింట మూడొంతులు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు చేయటం విశేషం. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో పసిడి కొనుగోళ్లు కళతప్పాయని..ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడంతో రైతుల ఆదాయం పెరిగి రెండో అర్థభాగంలో బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపే అవకాశం ఉన్నదని అసోచామ్-వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి.

బంగారమేమి విలాసవంతమైనది కాదని, సామాన్యులు కూడా భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారని సర్వే నివేదించింది. గడిచిన ఐదేండ్లకాలంలో ప్రతి ఇంటిలో ఇద్దరిలో ఒక్కరు బంగారాన్ని కొనుగోలు చేశారంటా. అంటే ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థమవుతున్నది. ఈ విషయం ఐసీఈ 360 నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న 87 శాతం కుటుంబాలు ప్రతియేటా బంగారాన్ని కొనుగోలు చేయడానికి కొంతమేర నిధులను వెచ్చిస్తున్నారు. సామాన్యులతో పోలిస్తే సంపన్న వర్గాలు పసిడిని కొనుగోలు చేయడానికి ఎంతైన వెచ్చిస్తున్నారు. గడిచిన సంవత్సరంలో సరాసరిగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి రూ.30,298 వెచ్చించారు. తమ కుటుంభంలో జరిగే పెళ్ళిళ్ళకోసం ముందస్తుగానే పసిడిని కొనుగోలు చేస్తుంటారు. వీటితోపాటు బహుమతులు అందచేయడానికి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం, పండుగ సీజన్ ముఖ్యంగా ధంతేరస్ నాడైతే ప్రతి ఒక్కరు కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు.