అసెంబ్లీ రద్దుపై జోక్యం చేసుకోలేం

-సభ రద్దు, గవర్నర్ ఆమోదంలో ఉల్లంఘనలు ఎక్కడ? -వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం.. -పిటిషన్ దాఖలువెనుక రాజకీయ ఉద్దేశం ఉందా అంటూ నిలదీత
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ను ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. శాసనసభ రద్దుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం, అనంతరం గవర్నర్ ఆమోదం నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించకుండా సీఈసీకి ఆదేశాలు జారీచేయాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే లోక్‌సభ ఎన్నికలతోపాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు చేస్తూ శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సిద్ధమైందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉన్నదని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు చేపట్టకుండానే నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉన్నదని వివరించారు. ఒకవేళ నోటిఫికేషన్ జారీచేస్తే న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకోలేవు కాబట్టి నోటిఫికేషన్ జారీచేయకుండా సీఈసీకి ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు.

మంత్రిమండలి తమ ఇష్టానుసారంగా శాసనసభను రద్దు చేసిందని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పం దిస్తూ.. రాజ్యాంగం కల్పించిన అధికరణ 174(2)(బీ) ప్రకారం మంత్రిమండలి సిఫారసుల ప్రకారం శాసనసభను రద్దు చేసే పూర్తి అధికారం గవర్నర్‌కు ఉంటుందనే విషయాన్ని ప్రస్తావించింది. శాసనసభ రద్దుకు మం త్రిమండలి తీసుకున్న నిర్ణయంలో, గవర్నర్ ఆమోదంలో రాజ్యాంగ ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయని ప్రశ్నించింది. శాసనసభ రద్దయిన తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ చేపడుతున్న చర్యల్లో తప్పులు, ఉల్లంఘనలు ఉంటే చూపాలని పేర్కొన్నది. ఇవేమీ చెప్పకుండా నోటిఫికేషన్ జారీచేయకుండా ఈసీని ఆదేశించాలని ఎలా అభ్యర్థిస్తారని నిలదీసింది. ఎన్నికల నిర్వహణకు ఈసీ యత్నిస్తున్నదని మీరే చెప్తున్నారు కదా, అందులో తప్పేమున్నదని పిటిషనర్‌ను ఉద్దేశించి పేర్కొన్నది. సీఈసీ వ్య వహారాల్లో న్యాయస్థానాలు ఎలా జో క్యం చేసుకుంటాయని.. ఒకవేళ నిబంధనలు పాటించకుంటే, ఉల్లంఘనలు జరిగితే కోర్టులు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయం తెలు సు కదా అని పేర్కొన్నది. మీ సందేహాలను తీర్చుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా అంటూ మందలించింది. వ్యాజ్యం దాఖలు చేయడానికి వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నించింది.

సీఈసీ లాంటి రాజ్యాంగ సంస్థ విధుల్లో తామెలా జోక్యం చేసుకుంటామని, సీఈసీ విధులపై న్యాయస్థానాలు అజమాయిషీ చేయలేవని పేర్కొన్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఎవరో చెప్తే ప్రభావితమయ్యే సంస్థ కాదని, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకా రం ఆయా సభలకు, నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం లేనిసమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత సీఈసీకి ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదని గుర్తుచేసింది. తెలంగాణ శాసనసభకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు? ఇతర రాష్ట్ర ఎన్నికలతో కలిపి నిర్వహిస్తున్నారా? అనే అంశాలను ఆరా తీసే బాధ్యత కోర్టులది కాద ని వ్యాఖ్యానించింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే, ఎన్నికల నిర్వహణలో ఆయా చట్టాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితేనే కోర్టులు జోక్యం చేసుకుంటాయని చెప్పింది. శాసనసభ రద్దు, గవర్నర్ ఆమోదం, ఎన్నికల నిర్వహణకు యత్నాల్లో ఉల్లంఘనలు జరిగినట్టు తమకు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Related Stories: