హైదరాబాద్‌లో వానజోరు

-రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌లోనూ భారీగా.. -పొంగిన వాగులు, చెరువులు -నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం -రాగల మూడు రోజుల్లో పలుచోట్ల వానలు -జోరందుకున్న వానలు -గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీగా.. -లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: రెండుచోట్ల ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలపాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో వర్షం దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. అత్యధికంగా గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లిలో 8.2 సెంటీ మీటర్లు, రంగారెడ్డి పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజామున గ్రేటర్ హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రహదారులు చెరువులను తలపించాయి. శేరిలింగంపల్లిలోని ఖాజాగూడ పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి అ లుగు పారింది. ఈ చెరువు కిందనే ఉన్న ఓ ని ర్మాణ సంస్థ సెల్లార్‌లోకి భారీ వరద వచ్చి చే రింది. సదరు నిర్మాణదారులు సెల్లార్‌లో చేరిన వరదను పక్కనే ఉన్న నాలాలోకి మళ్లించారు. ఒ క్కసారిగా నాలాలోకి వరద చేరడంతో నాలా కింది భాగంలో ఉన్న ఖాజాగూడ సాయి వైభవ్ కాలనీ జలమయమైంది. మూడు అంతర్గత రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. సమీప ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న వారు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాలు మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించడంతో నీరు సాఫీగా వెళ్లిపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

పొంగిన పందెం వాగు..

గ్రేటర్ హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోగల పంచవటి కాలనీలో సమీపంలోని పందెం వాగు పొంగి ప్రవహించింది. దీంతో స్థానికంగా ఇండ్లు, అపార్టుమెంట్లలోకి భారీగా వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కీసర, రాంపల్లి, దమ్మాయిగూడలోనూ భారీ వర్షం కురిసింది. కీసర పెద్దమ్మ చెరువులోకి భారీగా వరద వచ్చి చేరింది. దాదాపు 27 ప్రాంతాల్లో నీటి నిల్వగా వెంటనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు తగిన చర్యలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో 10 చెట్లు పడిపోగా వాటిని సత్వరం రోడ్లపై నుంచి తొలిగించినట్టు ఆయన పేర్కొన్నారు.

చారకొండలో భారీ వర్షం

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. గత నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా కుండపోత కురవడంతో కుంటలు, చెరువులకు నీళ్లు రావడంతోపాటు వాగులు పారాయి. చారకొండ వాగు చెక్ డ్యాం అలుగుపారింది.

నల్లగొండ జిల్లాలో...

నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లబడినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడింది. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మాడ్గులపల్లి, నల్లగొండ మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. నిజామాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నీరు నిలవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్రంలో వర్షాలు

30 బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు రుతుపవనాలు చురుకుగా కదులుతున్న క్రమంలో రెండుచోట్ల ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. తూర్పు, మధ్య ఆరేబియా సముద్రం దానిని ఆనుకొని ఉన్న దక్షిణ మహారాష్ట్ర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం, మరో వైపు తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కి.మీ.నుంచి 7.6 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈనెల 30నాటికి ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్నారు.

వర్షపాతం వివరాలు ఇలా..

సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 98మి.మీ., గ్రేటర్ హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 93.8, సిద్దిపేట జిల్లా చిట్యాలలో 91, రంగారెడ్డి ఖాజాగూడ, గచ్చిబౌలిలో 82.8, రాయదుర్గం 76.3, మాదాపూర్ 76, నాగర్‌కర్నూల్ జిల్లా బొల్లంపల్లి 80.8, కరీంనగర్ జిల్లా గన్నేరువరం, ఖాసింపేటలో 76 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

Related Stories:

More