హైదరాబాద్‌లో భారీవర్షం

-లోతట్టుప్రాంతాలు జలమయం -క్యుములోనింబస్ మేఘాలే కారణం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం ఏకధాటిగా వానకురిసింది. క్యుములోనింబస్ మేఘాలు ఆవరించడంతో హైదారాబాద్‌తోపాటు శివార్లలో సాయంత్రం దాదాపు రెండుగంటలసేపు ఉరుములు మెరుపులతో భారీవర్షం కురువడంతో జనజీవనం అతలాకుతలమయింది. పాతబస్తీతోపాటు హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో 3 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చార్మినార్‌లో 66.8 మి.మీ., ఆసిఫ్‌నగర్‌లో 63.5 మి.మీ., అత్తాపూర్, మాదాపూర్‌లో 57.5 మి.మీ., జూపార్క్ వద్ద 50.5 మి.మీ., మైత్రీవనం వద్ద 47.5 మి.మీ., బండ్లగూడలో 41 మి.మీ., శ్రీనగర్ కాలనీలో 38.5 మి.మీ., ఖైరతాబాద్‌లో 30.3 మి.మీ., నాంపల్లిలో 30 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. సాధారణ పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మికంగా కుండపోత వర్షాలు కురువడం సహజమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.