గులాబీ పార్టీలోకి వలసల జోరు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: టీఆర్‌ఎస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఆదివారం కూడా ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ఇతర సంఘాల వారు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, రాజాపూర్ మండలంలో బుడగ జంగం నాయకులు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన 700 మంది మంత్రి జోగు రామన్న సమక్షంలో, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వందమంది యువకులు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూరుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సమక్షంలో, వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో 30 మందికిపైగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి సమక్షంలో, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల శివారు గుంటూరుపల్లికి చెందిన 50 కుటుంబాలతోపాటు నీర్మాల ఉన్నత పాఠశాల విద్యాకమిటీ చైర్‌పర్సన్ మనోహరమ్మ, రామచంద్రాపురంలోని యువకులు పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో, పెద్దపల్లి జిల్లా మంథనిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గూడూరుకు చెందిన 100మంది కాంగ్రెస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు పెద్దపల్లి మండలాలకు చెందిన వంద మంది తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సమక్షంలో, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో150 మంది తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి సమక్షంలో, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో 200 మంది, వడ్డెర కాలనీకి చెందిన 150 మంది కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.