టీఆర్‌ఎస్‌లోకి వలసల వెల్లువ..

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: గులాబీ పార్టీలోకి వలసల ప్రవాహం కొనసాగుతున్నది. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. సోమవారం కూడా పెద్ద ఎత్తున గులా బీ గూటికి చేరారు. వనపర్తి మండలం రాజనగరం, వనపర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వనపర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో, పాలమూరు జిల్లా కేంద్రంలోని మోతీనగర్‌లో బీజేపీకి చెందిన 30మంది కార్యకర్తలు తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం కోతులాబాద్, మల్లాపూర్, పెర్కివీడ్ తండాల నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 430 మంది తాజా మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో, మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణ మండలంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 100 మంది కార్యకర్తలు తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు, మల్లంపల్లి, కొండాపురం, గణేశ్ కుంట, పాలకుర్తి గ్రామాలకు చెందిన 300 మందితోపాటు దేవరుప్పులలోని బస్టాండ్ కాలనీకి చెందిన 20 కుటుంబాల వారు పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చెరుపల్లి, లచ్చిగూడెం, పత్తిపాక గ్రామాలకు చెందిన 200 కుటుంబాల వారు భద్రాచలం టీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ సమక్షంలో, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో 200 మంది, విర్దండిలో 100 మంది, సదాశిపేటలో 50మంది, చింతలమానేపల్లి మండలంలో 50మంది తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో గులాబీ గూటికి చేరారు.