కడెం దిగువన జలకళ

-ఎగువన వరద లేకున్నా.. -స్థానిక వరదతో మూడురోజులుగా గోదావరి పరవళ్లు -ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు నీటికుండలు -మేడిగడ్డతోనే స్థానిక వరదను ఒడిసిపట్టే అవకాశం -కాళేశ్వరం వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారాలకు చెంపపెట్టు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురవాలి.. శ్రీరాంసాగర్ నిండాలి.. కడెం పొంగాలి.. ఆ తరువాతే ఎల్లంపల్లి దిగువన జలకళ. ఇదీ ఇప్పటివరకు గోదావరిలో నీటి లభ్యతపై జరిగిన ప్రచారాలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలను మభ్యపెట్టేందుకు కొందరు ప్రచారం చేసిన అవాస్తవాలు. కానీ, మూడురోజులుగా పరవళ్లు తొక్కుతున్న గోదావరి ఈ తప్పుడు ప్రచారాలను వరదలో కొట్టుకుపోయేలా చేసింది. కడెం నుంచి ఔట్‌ఫ్లో లేకపోయినా దిగువన జలసిరికి ఢోకాలేదని నిరూపించింది. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు జలరాశులు ఉట్టిపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పనులు కొనసాగుతున్న లింక్-1 (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి) పరిధిలో గోదావరిలో వేల క్యూసెక్కుల వరద కనిపిస్తుండటం విశేషం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపకల్పనలో భాగంగా గోదావరిపై వరుస బరాజ్‌ల నిర్మాణంతో స్థానికంగా కురిసిన వర్షాలతో గోదావరిలోకి వస్తున్న వరదను ఒడిసిపట్టే అవకాశం కలిగింది. దీంతోపాటు, ప్రతినీటి చుక్కనూ లెక్కించే అవకాశం కూడా దొరికింది. మూడురోజులుగా ఎల్లంపల్లి దిగువన కన్నెపల్లి పంపుహౌజ్ (మేడిగడ్డ) వరకు గోదావరిలో వేల క్యూసెక్కుల ప్రవాహం కనిపిస్తున్నది.

ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులు ఐదుపాయింట్ల వద్ద గోదావరి ప్రవాహ మోతాదును నమోదు చేస్తున్నారు. గత నెలలో మహారాష్ట్ర నుంచి దిగువకు వరద రాకున్నా.. ఎల్లంపల్లికి భారీఎత్తున వరద వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కడెం ప్రాజెక్టు ద్వారా అవుట్‌ఫ్లోగా వచ్చిన వరద ఎల్లంపల్లికి చేరింది. అటుఎస్సారెస్పీ, ఇటు కడెం నుంచి చుక్కనీరు రాకున్నా ఎల్లంపల్లి వద్ద మాత్రం తాజాగా జలకళ కనిపిస్తున్నది. ఈ నెల 21వ తేదీ ఉదయం ఐదువేల పైచిలుకు క్యూసెక్కులుగా నమోదైన ఎల్లంపల్లి సర్‌ప్లస్.. అంతకంతకూ పెరిగి 45 వేల క్యూసెక్కులకు పైగా చేరుకుంది. దీంతోపాటు ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్ వద్ద కూడా 50-70 వేల క్యూసెక్కుల వరద ఉంటే.. దాని దిగువన ఉన్న అన్నారం బరాజ్ వద్ద 80 వేల క్యూసెక్కుల పైచిలుకు వరద నమోదయింది. కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద ఏకంగా 1.23 లక్షల క్యూసెక్కులకుపైగా డిశ్చార్జి ఉంది. ఆదివారం కూడా ఇదేరీతిన వరద కొనసాగింది.

ఎస్సారెస్పీకి 12,190 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం 12,190 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1084.80 అడుగులు (66.218 టీఎంసీల) నీరుంది. ప్రాజెక్టు నుంచి 5,552 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా విడుదల అవుతున్నది. ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్లతో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. కృష్ణాబేసిన్‌లోని జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా పెరిగింది. ఆదివారం ఇన్‌ఫ్లో 7,400 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 4,018 క్యూసెక్కులుగా నమోదయింది.

Related Stories: