హాయ్‌లాండ్ ముట్టడికి యత్నం

అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు బుధవారం ఛలో హాయ్‌లాండ్ పేరుతో చేపట్టిన ముట్టడి ఉద్రిక్తతంగా మారింది. అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంఘం పిలుపుమేరకు గుంటూరు అర్బన్ జిల్లాలోని హాయ్‌లాండ్‌ను ముట్టడించేందుకు బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జిల్లావ్యాప్తంగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ముట్టడికి వచ్చే అగ్రిగోల్ బాధితులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కాజా టోల్‌గేటు, మంగళగిరి వై జంక్షన్ వద్ద పలువురు బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, విజయవాడ నుంచి బయలుదేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. 32లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం సిద్ధమైందని వారు మండిపడ్డారు.