మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానేమో!

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇప్పుడు మంచి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నా.. ఒకప్పుడు ఆమె కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నదన్న విషయం అభిమానులకు తెలుసు. కెరీర్ గాడి తప్పి.. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందామె. ఆ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు దీపికానే చెప్పింది. తాజాగా మరోసారి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఫైండింగ్ బ్యూటీ ఇన్ ఇమ్‌పర్ఫెక్షన్ అనే ఈవెంట్‌లో పాల్గొన్న దీపికా.. ఆ చేదు జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంది. అంతేకాదు మరోసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానేమో అన్న భయం కూడా తనకు ఉన్నట్లు ఆమె చెప్పింది. ఇప్పటికి కూడా ఏ విషయంలో అయినా నాకు ఆతృతగా అనిపిస్తుంటే.. లోలోపల భయం మొదలవుతుంది.

వెంటనే నా ఆలోచనలను నియంత్రించాలని అనుకుంటాను. గట్టి శ్వాస పీల్చుకోవడం, సరిపడా నిద్రపోవడం చేస్తాను. డిప్రెషన్ నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. శారీరకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంతో అవగాహన కల్పించింది. అయినా మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానేమో అన్న భయం మాత్రం నాకు ఇంకా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు నా ఆలోచనలను, నా భావోద్వేగాలను అదుపు చేసుకుంటూనే ఉంటాను అని దీపికా చెప్పింది. తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన విషయాన్ని మొదట తన తల్లి ఉజ్జలా పదుకోన్ గుర్తించిందని, సరైన సమయంలో కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లడంతో తాను కోలుకున్నానని దీపికా తెలిపింది.

Related Stories: