మరో పెళ్లి చేసుకున్నాడని మాజీ భార్య ఘాతుకం

హర్యానా : తనకు విడాకులిచ్చి.. కొన్ని రోజుల తర్వాత మరో మహిళను వివాహం చేసుకున్న మాజీ భర్తపై మాజీ భార్య పగ పెంచుకుంది. తనలో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని ఆ నవ వధువుపై చూపించింది ఆ మాజీ భార్య. తన బంధువులతో ఆమెపై అత్యాచారం చేయించి.. కక్ష తీర్చుకుంది. ఈ దారుణ సంఘటన హర్యానాలోని పానిపట్టులో బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి.. గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు భరించలేని భర్త.. గతేడాది డిసెంబర్‌లో భార్యకు విడాకులిచ్చాడు. దీంతో మరింత రగిలిపోయింది మాజీ భార్య. ఇక తనకు మరో తోడు కావాలని భావించిన మాజీ భర్త.. వారం రోజుల క్రితం ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే తన మాజీ భర్త మరో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మాజీ భార్య.. అతనిపై పగ పెంచుకుంది. మొత్తానికి బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మాజీ భర్త ఇంటికి తన బంధువులతో ఆమె చేరుకుంది. మాజీ భర్త, మహిళతో పాటు అత్తను తీవ్రంగా చితకబాదారు. అత్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక మాజీ భర్త, మహిళను వేర్వేరు వాహనాల్లోకి ఎక్కించుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తన మాజీ భర్తకు విడాకులివ్వాలని ప్రస్తుత భార్యను మాజీ భార్య వేధింపులకు గురి చేసింది. విడాకులిచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆమెపై కదులుతున్న వాహనంలోనే అత్యాచారం చేశారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో బహదుర్గాహర్ బస్టాండ్‌లో మాజీ భర్తతో పాటు ప్రస్తుత భార్యను వదిలిపెట్టారు. తీవ్ర గాయాలపాలైన వీరిద్దరూ క్యాబ్‌లో పానిపట్టుకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ భార్య నివాసముండే గురుగ్రామ్‌కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Related Stories: