కుటుంబ రాజకీయాల్లో ఓ రెబల్.. హరికృష్ణ

హైదరాబాద్: రాజకీయాల్లో హరికృష్ణ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడిగానే కాకుండా కుటుంబ రాజకీయాల్లో ఓ రెబల్‌గా హరికృష్ణ ప్రత్యేకంగా నిలిచారు. తన తండ్రి పార్టీ పెట్టిన సమయంలో ఆయన చైతన్య యాత్రకు రథసారథిగా ఆయనే వ్యవహరించారు. 9 నెలల పాటు ఎన్టీఆర్ చైతన్య రథాన్ని ఆయనే నడిపారు. తండ్రితో కలిసి రాష్ట్రం మొత్తం నాలుగుసార్లు పర్యటించారు. అయితే అలాంటి వ్యక్తి 1995లో తన తండ్రికి వెన్నుపోటు పొడిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు అప్పట్లో అండగా నిలిచారు. ఆయన ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 1996లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 1999 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు ఎదురుతిరిగారు.

1999, జనవరి 26న అన్నా టీడీపీ పార్టీ స్థాపించారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ఆయన తమ్ముడు బాలకృష్ణ.. బాబువైపు నిలిచినా హరికృష్ణ మాత్రం చాలా కాలం బాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. 2009 ఎన్నికలకు ముందు మరోసారి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌లను బాబు మరోసారి దగ్గరకు తీశారు. దీంతో ఆ ఎన్నికల్లో ఇద్దరూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత హరికృష్ణ రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే రెండోసారి ఆయనను రాజ్యసభకు పంపకపోవడంతో బాబుతో మరోసారి విభేదాలు వచ్చి కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు.

Related Stories: