పటేళ్లకు కోటా.. కాంగ్రెస్‌తో హార్దిక్ దోస్తీ..

అహ్మాదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని పటేల్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరినట్లు ఆయన ఇవాళ మీడియాకు తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)కి కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చిందన్నారు. ఒకవేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే, పటేళ్లకు కోటా ఇస్తామని కాంగ్రెస్ పేర్కొన్నట్లు హార్దిక్ తెలిపారు. సెక్షన్ 31, సెక్షన్ 46 కింద రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందన్నారు. ఉద్యోగాలు, విద్యలో కోటా పొందని వారికి ఓబీసీ ప్రకారం ప్రయోజనాలు కల్పించనున్నట్లు హార్దిక్ పటేల్ తెలిపారు. అయితే కాంగ్రెస పార్టీ తన మేనిఫెస్టోలో రిజర్వేషన్ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటేళ్లు ఎటువంటి అసెంబ్లీ టికెట్లు ఆశించలేదని, కేవలం రిజర్వేషన్లు మాత్రమే కావాలని ఆ పార్టీని కోరినట్లు హార్దిక్ తెలిపారు. విద్యా, ఉద్యోగ హక్కు కోసమే తాము రిజర్వేషన్ కోరుతున్నట్లు హార్దిక్ చెప్పారు. బీజేపీపై తనకు ఎటువంటి శత్రుత్వం లేదని, కానీ ప్రభుత్వం ఆరు కోట్ల గుజరాతీల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. తమ ఆందోళన విరమింప చేసేందుకు బీజేపీ ప్రభుత్వం రూ.1200 కోట్ల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. మరోవైపు ఆదివారమే కాంగ్రెస్ పార్టీ తన మొదటి లిస్టులో 77 మంది అభ్యర్థులను ప్రకటించింది. డిసెంబర్ 9, 14వ తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పటేళ్లు కీలక పాత్ర పోషించనున్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?