శివసేన తాజా అస్త్రం హార్దిక్ పటేల్

ముంబై: పటేళ్లకు ఓబీసీ రిజర్వే షన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన ఆందోళనతో గుజరాత్‌లో అధికార బీజేపీకి కంటిలో నలుసులా మారిన హార్దిక్ పటేల్ ఆ దిశగా మరో అడుగు ముందు కేశారు. ప్రధాని మోదీ విధానాల పై నిత్యం విమర్శనాస్ర్తాలు సంధిస్తూ ఇబ్బంది పెడ్తున్న ఎన్డీఏ మిత్రపక్షం శివసేనతో చేతులు కలిపారు. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా శివసేన తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు. సోమవారం రాత్రి ముంబైకి చేరిన హార్దిక్ పటేల్ మంగళవారం ఉదయం బంద్రాలోని ఉద్ధవ్‌తో ఆయన నివాసం మాతృ శ్రీలో సమావేశం అయ్యారు. తాను ముంబైలోని పాటిదార్లతో సమావేశమయ్యేందుకు వచ్చానని, తన పర్యటనలో ఎటువంటి రాజకీయం లేదన్నారు. భావ సారూప్యం గల వ్యక్తులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. త్వరలో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హార్దిక్ రాక ప్రాధాన్యం సంతరించుకున్నది. 2014 ఎన్నికల నుంచి శివసేన, బీజేపీ మిత్రపక్షాలైనా మాటల యుద్ధం సాగు తూనే ఉన్నది. తాజాగా బీఎంసీ ఎన్నికల్లో శివసేన సంప్రదాయ ఓటుబ్యాంకు మరాఠీలను తనవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది.

Related Stories: