హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష

అహ్మదాబాద్: గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు విస్‌నగర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 అల్లర్ల కేసుకు సంబంధించి కోర్టు తన తీర్పు వెల్లడించింది. విస్‌నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు హార్దిక్‌తోపాటు మరో ఇద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. హార్దిక్‌తోపాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్‌లకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది. కోర్టు తీర్పు వెలువరించే ముందే తన మద్దతు దారులతో హార్దిక్ పటేల్ సమావేశమయ్యారు. తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా.. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చేపట్టకూడదని వాళ్లకు చెప్పారు.

2015లో పటీదార్ ఉద్యమ సమయంలో 3 వేల నుంచి 5 వేల మంది ఉద్యమకారులు బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ పటేల్ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి హార్దిక్‌తోపాటు మరో 17 మందిపై నేరపూరిత కుట్ర, దాడి, అల్లర్ల కేసులను నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే హార్దిక్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. ఆయనను మెహసానా జిల్లాలోకి అడుగుపెట్టకుండా కోర్టు నిషేధం విధించింది.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు