11వ రోజుకు చేరిన హార్దిక్ పటేల్ నిరాహార దీక్ష

అహ్మదాబాద్ : పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్దిక్ పటేల్ దీక్షకు దిగడం వెనుక కాంగ్రెస్ హస్తమున్నదని గుజరాత్ ప్రభుత్వం ఆరోపించింది. ఆయన ఆందోళన, దీక్ష పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని విమర్శించింది. విద్య, ఉద్యోగాల్లో పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ పటేల్ చేపట్టిన నిరవధిక నిరాహార మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ఇంధన శాఖ మంత్రి సౌరభ్ పటేల్ మాట్లాడుతూ హార్దిక్ దీక్ష రాజకీయ ప్రేరేపితమైనది. దీని వెనుక కాంగ్రెస్ హస్తమున్నది అని ఆరోపించారు. పేదలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని గుర్తుచేశారు. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. పాటిదార్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారు.
× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్