ఏటీఎంలను కొల్లగొట్టేందుకు హ్యాకర్ల కుట్ర?

ఏటీఎంలను హ్యాక్‌చేసి పెద్దఎత్తున డబ్బును దోచుకునేందుకు హ్యాకర్లు కుట్ర పన్నుతున్నారా? ఏకకాలంలో అనేక ఏటీఎంలపై హ్యాకర్ల దండు దాడిచేసి చేసి చివరి నోటునూ లాగేసుకోబోతున్నారా? అమెరికా ఎఫ్‌బీఐ కొన్ని బ్యాంకులకు జారీచేసిన రహస్య హెచ్చరికలు చదివితే ఇది నిజమేననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. రాబోయే కొద్దిరోజుల్లో కంప్యూటర్ జాదూటోనాలు ఏటీఎం జాక్ పాటింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందని ఎఫ్‌బీఐ గత శుక్రవారం రహస్యంగా హెచ్చరించినట్టు బ్రిటన్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏకకాలంలో సమన్వయంతో ఏటీఎంలను హ్యాక్‌చేసి, డబ్బును ఖాళీ చేయడాన్ని ఏటీఎం జాక్‌పాటింగ్ అంటున్నారు. బ్యాంకు లేదా పేమెంట్ ప్రాసెసర్‌ను వశపర్చుకుని నకిలీకార్డులతో డబ్బును నిమిషాల్లో హాంఫట్ చేసేయడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. ఇలాంటి దాడి జరుగబోతున్నదన్న సంకేతాలు ఎఫ్‌బీఐకి అందాయంటున్నారు. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే హెచ్‌ఎస్‌బీసీ, బార్‌క్లేస్ వంటి భారీస్థాయి అంతర్జాతీయ బ్యాంకులకు ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు యూకే టెలిగ్రాఫ్ రాసింది. కార్డు జారీ ప్రక్రియలో తలెత్తిన గుర్తుతెలియని లోపం వల్ల ఈ ముప్పు ఎదురవుతున్నదని ఎఫ్‌బీఐ పేర్కొన్నట్టు క్రెబ్‌సన్ సెక్యూరిటీ సంస్థ పేర్కొన్నది. తక్కువ జాగ్రత్తలతో డెబిట్ కార్డులు జారీచేసే చిన్న బ్యాంకులను ముందుగా లక్ష్యంగా చేసుకుంటారు. కార్డుల క్లోనింగ్ తర్వాత పెద్ద బాయంకుల ఏటీఎంల మీద పడతారు. ఇదీ టెక్నిక్. సంఘటిత ముఠాలు ఎంతకు తెగిస్తాయనడానికి ఈ హెచ్చరిక ఓ సంకేతమని టెక్నాలజీ రంగనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2016లో థాయ్‌ల్యాండ్‌లో ఇలాంటి దాడిలోనే నేరముఠాలు సమన్వయంతో కూడిన దాడిలో ప్రభుత్వ పొదుపు బ్యాంకు ఏటీఎంల నుంచి సుమారు రు.రెండున్నర కోట్ల విలువ చేసే కరెన్సీని స్వాహా చేశారు. 2016, 2017లో అమెరికాలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ బ్లాక్స్‌బర్గ్ ఏటీఎంల నుంచి సుమారు రు.నాలుగు కోట్ల విలువచేసే అమెరికా కరెన్సీని కొట్టేశారు. ఈ దృష్ట్యా బ్రిటన్ బ్యాంకులు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వార్తలపై బ్రిటన్ భద్రతా సంస్థలు వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.

Related Stories: