జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం

న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలోనూ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నెలకుగాను రూ.85,174 కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేవలం 69 శాతం మంది మాత్రమే ఐటీ రిటర్నులు దాఖలు చేయడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఈ నెల 25 నాటికి వీరిలో 59.51 లక్షల మంది జీఎస్టీర్ 3బీ రిటర్నులు దాఖలు చేశారట. అంటే ప్రతినెల ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారిలో వీరి వాటా 70 శాతం లోపేనని తెలిపింది. జనవరిలో వసూలైన రూ.86,318 కోట్లతో పోలిస్తే ఆ మరుసటి నెలలో(మార్చి 26 వరకు) జీఎస్టీ వసూళ్లు రూ.85,174 కోట్లకు తగ్గాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే డిసెంబర్‌లో రూ.88,929 కోట్లు, నవంబర్‌లో రూ.83,716 కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి విషయానికి వస్తే సెంట్రల్ జీఎస్టీ కింద రూ.14,945 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.20,456 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.42,456 కోట్లు, పరిహారం సెస్ కింద రూ.7,317 కోట్లు వసూలయ్యాయి. వీటిలో రూ.25,564 కోట్లను ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీ/ఎస్‌జీఎస్టీ కింద బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ నెల 25 నాటికి 1.05 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చే నెల అమల్లోకి రాను న్న ఈ-వే బిల్లుతో జీఎస్టీ వసూళ్లు పెరిగే వీలుందని ఈవై పార్టనర్ అభిషేక్ జైన్ తెలిపారు. మరింత సరళంగా ఫిర్యాదు దరఖాస్తు.. జీఎస్టీపై ఫిర్యాదు చేయడానికి రూపొందించిన దరఖాస్తు ఫారంను మరింత సరళతరం చేయడానికి దీనిలో ఉండే కాలమ్స్‌ల సంఖ్యను మరింత తగ్గించింది. గతంలో 16 కాలమ్స్ ఉండగా, దీనిని ఒకే పేజీలో వచ్చే విధంగా 12కి కుదించింది. ఈ నూతన అప్లికేషన్ ప్రకారం పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, గుర్తింపు ధ్రువీకరణ పత్రం వాటిని జతచేయాల్సి ఉంటుంది.

Related Stories: