ఈ మొక్కలు దోమల్ని తరుముతాయ్..!

దోమ.. చాలా చిన్నదే. కానీ అది కుట్టిందంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సాధారణ దోమలు అయితే ఫర్వాలేదు. కానీ జ్వరాలను వ్యాపింపజేసే దోమలు కుడితేనే.. సమస్యలు వస్తాయ్. వాటితోపాటు ఇతర అనారోగ్య సమస్యలను మోసుకొచ్చే దోమలు కూడా మన పరిసరాల్లో ఉంటాయి. అయితే వాటిని తరమడం కోసం కింద సూచించిన విధంగా పలు మొక్కలను మీ ఇంట్లో పెంచుకోండి. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉండడమే కాదు, ఈ మొక్కలు దోమలను కూడా తరుముతాయి.

1. లెమన్‌బామ్

దీన్ని హార్స్‌మింట్ లేదా బీ బామ్ అని పిలుస్తారు. వీటి నుంచి విడుదలయ్యే వాసన దోమల్ని తరుముతుంది. ఈ మొక్క చాలా త్వరగా పెరుగుతుంది. నీరు చాలా తక్కువగా అవసరం అవుతుంది. తోటలో, ప్రహరీ గోడలపై, ఇంట్లో కిటికీల వద్ద ఈ మొక్కలను పెంచుకోవచ్చు.

2. అగిరేటమ్

ఈ మొక్క తెలుపు లేదా ఊదా రంగు పూలను పూస్తుంది. దీన్నే కంపురొడ్డ లేదా పోకబంతి అని తెలుగు వారు పిలుస్తారు. ఈ మొక్క గడ్డి మొక్కలా పెరుగుతుంది. కుండీల్లో పెంచుకుంటే దోమలు ఇంట్లోకి రావు.

3. కాట్నిప్

ఈ మొక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకుల్లో ఉండే నెపెటాలాక్టోన్ నూనె సహజ సిద్ధమైన మస్కిటో రీపెల్లెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల ఈ మొక్కలను ఇండ్లలో పెంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయి.

4. రోజ్‌మేరీ

ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఈ మొక్క దోమలను తరిమేస్తుంది. అలాగే ఈ మొక్క ఆకులను కొత్తిమీర, కరివేపాకులా వంటల్లో వేసుకుంటే వంటలకు చక్కని రుచి వస్తుంది.

5. పుదీనా

పుదీనాను చాలా మంది వంటల్లో వేస్తారు. కానీ ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయి.

6. సిట్రొనెల్లా

దీన్నే తెలుగులో కామంచి కసు అంటారు. దీన్ని మస్కిటో ప్లాంట్ అని పిలుస్తారు. ఈ మొక్కలను ఇండ్లలో పెంచుకుంటే వీటి ఆకుల నుంచి వచ్చే వాసనకు దోమలు పారిపోతాయి. నిజానికి ఈ మొక్క ఆకుల వాసన మనకైతే చాలా బాగుంటుంది. కానీ దోమలను మాత్రం తరుముతుంది.
× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..