గ్రేటర్ లో ఓటర్ల సంఖ్య 74.21లక్షలు

హైదరాబాద్ : గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల సంఖ్య 74,21,528కి చేరుకున్నది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాతో పోల్చుకుంటే 2,69,043 అదనం. ఈ మేరకు అధికారులు శనివారం ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేశారు. వచ్చే అక్టోబర్ 31వరకు సవరణలు, అభ్యంతరాలకు గడువు ఇచ్చారు. అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 4న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు.

గ్రేటర్‌లో ఈ ఏడాది జనవరితో పోల్చుకుంటే 3,06,743మంది ఓటర్లు కొత్తగా తమ పేర్లను జాబితాలో నమోదు చేసుకోగా, 37,700 ఓట్లను అధికారులు తొలగించారు. దీని ప్రకారం ఈ ఏడాది జనవరిలో 71,52,485మంది ఓటర్లు ఉండగా, తాజాగా వారి సంఖ్య 74, 21,528కి చేరుకుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 38,61009గా గుర్తించారు. ఇది ఈ ఏడాది జనవరిలో విడుదలచేసిన జాబితాతో పోల్చుకుంటే 54,190ఓట్లు పెరిగినట్లు స్పష్టమవుతున్నది. పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,826కు చేరింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ ఎం. దానకిషోర్ శనివారం ఓటర్ల ముసాయిదాను విడుదల చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో యూ కుత్‌పురలో అత్యధికంగా 321159మంది ఓటర్లు నమోదుకాగా, చార్మినార్‌లో అతి తక్కువగా 196016 మంది ఓటర్లతో చివరిస్థానంలో నిలిచింది. 315734మంది ఓటర్లతో జూబ్లీహిల్స్ రెండోస్థానంలో నిలువగా, 295586మంది ఓటర్లతో కార్వాన్ మూడవ స్థానంలో ఉంది. పురుష ఓటర్లు 2017448మంది కాగా, మహిళా ఓటర్లు 1843277మంది ఉన్నారు.

ఇక రంగారెడ్డి జిల్లా విషయానికొస్తే, గ్రేటర్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో గత జనవరిలో 16,39,512 మంది ఓటర్లుండగా, తాజాగా వారి సంఖ్య 18,10,896కు పెరిగింది. అంటే, గతంతో పోల్చుకుంటే 1,71,384మంది ఓటర్లు పెరిగినట్లు స్పష్టమవుతున్నది. అలాగే, మేడ్చల్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో గత జనవరిలో 14,82,542మంది ఓటర్లుండగా, తాజా ముసాయిదాలో 15,11,764 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే 29222మంది ఓటర్లు పెరిగారు. పటాన్‌చెరులో గతంలో 223612మంది ఓటర్లుండగా, తాజాగా 14247మంది ఓటర్ల పెరుగుదలతో 237859 ఓటర్లకు చేరుకుంది.

× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..