మహాకూటమి.. ఓ భ్రాంతి

-మేం మేకింగ్ ఇండియా అంటే కాంగ్రెస్ బ్రేకింగ్ ఇండియా అంటున్నది -బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సదస్సులో అమిత్‌షా ఉద్ఘాటన -అజేయ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కేంద్రంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే మహాకూటమి (గ్రాండ్ అలయెన్స్) అనేది ఓ భ్రాంతి, మిధ్య మాత్రమేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎద్దేవా చేశారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన రెండురోజుల పార్టీ జాతీయ కార్యనిర్వాహక సదస్సులో ఆయన ప్రసంగించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మేకింగ్ ఇండియా కోసం పనిచేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ బ్రేకింగ్ ఇండియా కోసం పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధించి, మళ్లీ అధికారాన్ని చేపడుతామని ఉద్ఘాటించారు. బీజేపీ ప్రత్యర్థులు ప్రతిపాదిస్తున్న మహాకూటమి అనేది ఒక భ్రాంతి, మిథ్య అని.. సదరు మహాకూటమి తమ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని ధీమా వ్యక్తంచేశారు. పేద ప్రజల అభ్యున్నతి, దేశాభివృద్ధి, జాతీయవాదం కోసం బీజేపీ పాటుపడుతుంటే.. ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములతో నిరాశ చెందిన కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్‌కు మద్దతు పలుకుతూ దేశాన్ని విచ్ఛిన్నం (బ్రేకింగ్ ఇండియా) చేయడానికి కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.

ప్రతిపక్షాలను అంతరాయవాదులు(డిస్ప్ష్రనిస్ట్స్)గా అభివర్ణించిన అమిత్ షా.. ఇక వారు ప్రజల అభిప్రాయాలకు ప్రతినిధులుగా ఎంతోకాలం కొనసాగబోరని విమర్శించారు. 2014 ఫలితాలను బీజేపీ పునరావృతం చేయలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తుండటంపై స్పందించిన ఆయన తాము 19 రాష్ర్టాల్లో అధికారం సాధించామని.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ర్టాల్లో కూడా అధికారం సాధించి తీరుతామని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధాని మోదీ ఛరిష్మా కలిగిన నాయకత్వం, సంస్థాగత బలంతో మళ్లీ అధికారంలోకి వస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం ప్రసంగించనున్నారు. అంతకుముందు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో అజేయ బీజేపీ నినాదంతో ముందుకువెళ్లాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.

అమిత్‌షా పదవీకాలం పొడిగింపు!

అమిత్‌షా నేతృత్వంలోనే 2019 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఇందుకోసం సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరితో బీజేపీ అధ్యక్షుడిగా అమిత్‌షా పదవీకాలం పూర్తవుతుంది. 2016 జనవరిలో అమిత్‌షాకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. నాటినుంచి 2019 జనవరితో మూడేండ్లు పూర్తికానుంది. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలు మే నెలలో ఉన్న నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలను ఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా వేయాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో అమిత్‌షా పదవీకాలం జనవరితో ముగిసినా పదవిలో కొనసాగనున్నారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు మూడేండ్లపాటు పదవిలో కొనసాగవచ్చు. దీనిప్రకారం అమిత్ షాకు మరోమారు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉన్నది.

Related Stories: