ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ రాజీనామా

న్యూఢిల్లీ : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ ఇవాళ‌ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రజా ప్రయోజనాల విషయంలో ఆర్బీఐ గవర్నర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు ఆర్బీఐ చట్టంలో ఉన్న అధికారాలను ప్రభుత్వం ఉపయోగించింది. ఈ అధికారాలను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉపయోగించలేదు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 7 కిందట తన అధికారాలను ఉపయోగిస్తూ వివిధ కీలక అంశాలపై ఆర్బీఐ గవర్నర్‌కు ప్రభుత్వం కొన్ని లేఖలు రాసింది. ఈ సెక్షన్ 7 కింద స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు గతంలోని ఏ ప్రభుత్వం కూడా తన అధికారాలను ఉపయోగించకపోవడం గమనార్హం. దీంతో ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఈ మధ్య ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య పబ్లిగ్గా కామెంట్ చేశారు. గవర్నర్ ఉర్జిత్ పటేల్ సూచనల మేరకే ఆయనిలాంటి వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. దీనికితోడు బ్యాంకుల నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోవడానికి ఆర్బీఐనే కారణమంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు కూడా గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను బాధించాయి. దీంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Stories: