పెట్రో సుంకాల తగ్గింపు లేనట్టే

-కేంద్రానికి ఆ ఆలోచనేదీ లేదంటున్న అధికార వర్గాలు -తగ్గిస్తే ద్రవ్యలోటు భారీగా పెరుగుతుందని అంచనా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వాటిపై ఎక్సైజ్, ఇతర సుంకాలను తగ్గించేందుకు కేంద్రం సిద్ధంగా లేదన్న వార్తలు వెలువడుతున్నాయి. ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గింపుతో తీవ్రమైన ఆర్థికలోటుకు దారితీసే అవకాశం ఉండటంతో కేంద్రం కానీ, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందుకు సుముఖంగా లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.19.48 ఉండగా, డీజిల్‌పై రూ.15.33 ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.1,84,091కోట్లను ఆర్జించింది. ఒకవేళ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ పోతే ఆ మేరకు ఆదాయంపై ప్రభావం పడుతుంది.

ఫలితంగా ద్రవ్యలోటు ఏర్పడటంతోపాటు, సంక్షేమపథకాల కేటాయింపుల్లో కోత పెట్టాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థికవ్యవస్థలో సున్నితమైన పరిస్థితులు నెలకొన్నందున, ప్రభుత్వం సాహసాలకు సిద్ధపడకపోవచ్చునని వారంటున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఆయా రాష్ర్టాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను వసూలు చేస్తున్నాయి. దీంతోపాటు కేంద్రం వసూలు చేస్తున్నదాంట్లో 42శాతం రాష్ర్టాలకు దక్కుతున్నది. వ్యాట్ ఒక్కో రాష్ర్టానికి ఒక్కోరకంగా ఉంది. లీటర్ ధరను ఒక్కరూపాయి తగ్గించేదిశగా పన్నును కుదించినా, రాష్ట్ర ఖజానాకు వచ్చే వార్షిక ఆదాయం వేల కోట్ల రూపాయలు తగ్గుతుంది. ఇలాంటి స్థితిలో రాష్ర్టాలు పన్ను తగ్గింపునకు చొరవ చూపకపోవచ్చు అని మరో అధికారి తెలిపారు.

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గించిన ఏపీ

రాజస్థాన్ 4శాతం వ్యాట్ తగ్గింపును ప్రకటించిన మరునాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రెండు రూపాయలు తగ్గించింది. పెట్రో ధరలకు వ్యతిరేకంగా విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.కొత్త ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని సీఎం చంద్రబాబునాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. వ్యాట్ తగ్గింపుతో రాష్ట్ర ఖజానాకు రూ.1120కోట్ల మేర ఆదాయం తగ్గనుందని అధికారులు తెలిపారు.

Related Stories: