పెట్రో ధరల పెంపుతో మాకేం సంబంధం: కేంద్రం

న్యూఢిల్లీ: ఓవైపు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న పెట్రో ధరలను నిరసిస్తూ భారత్ బంద్ జరుగుతున్నది. మరోవైపు బీజేపీ మాత్రం అసలు పెట్రోల్ ధరలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని మాట్లాడుతుండటం గమనార్హం. ప్రజలకు నిజమేంటో తెలుసు.. పెట్రో ధరల పెంపులో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. అవి కొన్ని బయటి కారణాల వల్ల జరుగుతున్నది అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. భారత్ బంద్ ఘోరంగా విఫలమైందన్న ఆయన.. కొన్ని రాష్ర్టాల్లో జరిగిన హింసను ఖండించారు. కొన్ని చోట్ల ప్రయాణానికి కొంతమంది ఇబ్బంది పడ్డారు తప్ప.. భారత్ బంద్‌కు ఎవరూ మద్దతివ్వలేదు. అదిప్పుడు కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలను ఆందోళనకు గురిచేస్తున్నది.

అందుకే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు హింసకు దిగారు అని రవిశంకర్ అన్నారు. అసలు ప్రజలు భారత్ బంద్‌కు ఎందుకు మద్దతివ్వడం లేదో తెలుసా.. పెట్రో ధరల పెరుగుదల అన్నది తాత్కాలికం అన్నది వాళ్లకు తెలుసు. భారత ప్రభుత్వం చేతుల్లో లేని కొన్ని కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయి అని రవిశంకర్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉన్నా.. ఇలా పెట్రోల్ బంకులు, బస్సులను తగలబెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.భార‌త్ బంద్‌లో భాగంగా బీహార్‌లో ఓ అంబులెన్స్‌ను ఆందోళ‌న‌కారులు అడ్డుకోవ‌డంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. దీనికి కాంగ్రెస్ ఏం స‌మాధానం చెబుతుంది అని ర‌విశంక‌ర్ నిల‌దీశారు.

× RELATED 16 మంది సీఎంలు పాలించినా అభివృద్ధి శూన్యం