తేజ్ యాప్ పేరు మార్చిన గూగుల్

గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ తేజ్ పేరును ఆ సంస్థ మార్చింది. తేజ్ ఇక నుంచి గూగుల్ పే కానుంది. ఈ బ్రాండ్ మార్పు వల్ల యూజర్లు రీటెయిల్ స్టోర్స్‌కు పేమెంట్లు చేయడంతోపాటు వివిధ యాప్స్‌లో ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేసే వీలుంటుంది. దేశంలో గూగుల్ ప్రవేశపెట్టిన తొలి డిజిటల్ పేమెంట్ యాప్ అయిన తేజ్ గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. తేజ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 75 కోట్ల ట్రాన్సక్షన్లు జరిగాయని, వీటి విలువ రూ. 2 లక్షల కోట్లు అని గూగుల్ తెలిపింది. ప్రతి నెల ఈ యాప్‌ను 2.2 కోట్ల మంది వాడుతున్నారని పేమెంట్స్ అండ్ నెక్ట్స్ బిలియన్ యూజర్స్ ఇనిషియేటివ్ మేనేజర్ సీజర్ సేన్‌గుప్తా తన బ్లాగ్‌పోస్ట్‌లో రాశారు. ఇక గూగుల్ పేను కొత్తగా మరికొన్ని యాప్స్, వెబ్‌సైట్స్, బ్రాండెడ్ రీటెయిల్ స్టోర్స్‌లోనూ వాడుకొనే అవకాశం కల్పించారు. ప్రస్తుతం గూగుల్ పేను గోఐబిబో, ఫ్రెష్‌మెను, రెడ్‌బస్‌లాంటి యాప్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నాయి. త్వరలోనే బుక్ మై షోలో కూడా గూగుల్ పేను వాడుకొనే అవకాశం కల్పిస్తామని సంస్థ తెలిపింది. అంతేకాదు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లాంటి వాటితో చేతులు కలిపిన గూగుల్ పే.. తమ కస్టమర్లకు లోన్లు కూడా ఇవ్వనుంది. గూగుల్ పే ద్వారా సదరు బ్యాంకుల నుంచి సాధ్యమైనంత తక్కువ పేపర్ వర్క్‌తో కస్టమర్లు లోన్లు పొందే వీలుంటుందని సేన్‌గుప్తా చెప్పారు.

Related Stories: