బంగారానికి ఆదరణ కరువు

రూ.250 తులం ధర న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: బంగారం ధరలు మరింత తగ్గాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడం, ముఖ్యం గా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవడంతో ధరలు దిగువముఖం పట్టాయి. దీంతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,450కి పరిమితమైంది. పసిడితోపాటు వెండి కూడా స్వల్పంగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో కిలో వెండి రూ.70 తగ్గి రూ.38,150 వద్దకు చేరుకున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన మరింత పెరిగిందని, తద్వారా గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరల తగ్గుముఖం పట్టాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 0.68 శాతం తగ్గి 1,198.70 డాలర్లకు, వెండి 14.25 డాలర్లకు పరిమితమైంది.