పండుగలా చెక్కుల పంపిణీ

-మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి -కామారెడ్డి జిల్లా వర్నిలో చెక్కుల పంపిణీ
వర్ని: రాష్ట్రం అంతటా పండుగ వాతావరణంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నదని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 10,556 గ్రామాల్లో 58 లక్షల మంది రైతులకు, 1.42 కోట్ల ఎకరాలకు రూ.5,700 కోట్ల సాయం చెక్కుల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లు, కోతమిషన్లు అందజేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. రైతులకు పెట్టుబడి బాధలు తప్పించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుంటే.. రైతులను అవమానించేలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రంలో 98.09 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, ప్రభుత్వం అందిస్తున్న డబ్బులు రైతులు పెట్టుబడులకే ఉపయోగించుకుంటారని, తాగడానికి కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.50 లక్షల క్వింటాల్ల సబ్సిడీ విత్తనాలు సహకార సంఘాల ద్వారా రైతులకు ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వానికి పాటుపడుతోందన్నారు. పంటలు పండించడం, మంచి దిగుబడులు సాధించడంలో వర్ని రైతులు రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్ రావు, బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి ఘనస్వాగతం..

బాన్సువాడ, నమస్తే తెలంగాణ/బాన్సువాడ రూరల్: రైతుబంధు పథకంలో భాగంగా ఈనెల 10 నుంచి 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ చేసి శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వచ్చిన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి రైతులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వారితో కలిసి స్టెప్పులేశారు. తాను జిల్లాలో అందుబాటులో లేకపోయినా రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి, రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులను మంత్రి అభినందించారు.

Related Stories: