బ్యాటింగ్‌లో సారథ్యంలో హిట్ ఫట్

-బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ పరుగుల వరద.. -కెప్టెన్‌గా పూర్తిగా విఫలం.. -ఇంగ్లండ్ పర్యటనలో టీమ్‌ఇండియా చెత్త రికార్డు
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు.. అవును ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా పేరు తెచ్చుకుంటాం..ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌కు ముందు భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్న మాటలివి. పరిస్థితులు పగబట్టిన వేళ..ప్రత్యర్థి ముందు మోకరిల్లిన టీమ్‌ఇండియా ఘోర ఓటమిని చవిచూసిన పరిస్థితి. గతానికి భిన్నంగా బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించిన కోహ్లీ..కెప్టెన్‌గా విజయాలందించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ గడ్డపై గతంలో ఎన్నడూలేని రీతిలో చిత్తుచిత్తయిన భారత జట్టు విమర్శల జడివాన కురుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ ఓటమిపై సమగ్ర కథనం.

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: విజయాలు సాధిస్తే తలపై పెట్టుకుని ఆరాధించే అభిమానులు..ఓటములు చవిచూసినప్పుడు ఆగ్రహంతో దుమ్మెత్తిపోస్తారు. క్రికెట్‌ను ఓ మతంగా భావించే కోట్లాది మంది భారతీయుల బలహీనతగా దీన్ని భావించవచ్చు. అవును క్రికెట్‌ను ఆశ, శ్వాస అనుకునే అభిమానుల అంచనాలను అందుకోవడంలో భారత జట్టు విఫలమైంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదన్న రీతిలో ఎదురైన ప్రత్యర్థి జట్లను చిత్తుచేసిన కోహ్లీ..విదేశాల్లో గత చరిత్రను తిరుగరాయలేకపోతున్నది. ఈ యేడాది ఇప్పటివరకు ఆరు టెస్ట్‌లు ఓడిపోవడమే దీనికి తార్కాణం. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా ఫేవరెట్. కానీ పోటీకి దిగాక తెలిసింది..అసలు సంగతి ఏంటో. టెస్ట్ టాప్ టీమ్‌గా బరిలోకి దిగిన కోహ్లీసేన.. ఇంగ్లండ్‌కు దీటుగా నిలువడంలో విఫలమైంది. క్షణక్షణానికి మారే ఇంగ్లిష్ పరిస్థితులకు అలవాటు పడటంలో మనోళ్లు సఫలం కాలేకపోయారు.

ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-4తో ప్రత్యర్థికి సమర్పించుకోవాల్సిన పరిస్థితి. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ వైఫల్యం, ఓపెనర్ల పేలవ ప్రదర్శన, జట్టు ఎంపిక, కోహ్లీ కెప్టెన్సీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి వ్యుహరచన మొదలైనవి. విరాట్ విహారం: సరిగ్గా నాలుగేండ్ల క్రితం ఇదే ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 134 పరుగులకు పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్వింగ్ ధాటికి విలవిలలాడిపోయాడు. పదింటిలో విరాట్‌ను అండర్సన్ నాలుగు సార్లు పెవిలియన్ పంపాడు. కానీ ఈసారి పరిస్థితి వేరు. నాలుగేండ్ల నాటికి ఇప్పటికీ అతని బ్యాటింగ్‌లో ఎక్కడ లేని మార్పు వచ్చింది. ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా నిలుస్తూ వేదిక ఏదైనా..ప్రత్యర్థి ఎవరైనా వెరవకుండా పరుగులు కొల్లగొట్టడంలో ఆరితేరాడు. ఈ క్రమంలో తనకు ఎదురైన ఎన్నో రికార్డులను అలవోకగా అధిగమించాడు. విమర్శకులకు దీటైన సమాధానిమిస్తూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల్లో ఏకంగా 593 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలతో సహా రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహచరులు విఫలమైన చోట వేదికలు ఏవైనా ఇంగ్లిష్ బౌలింగ్‌ను సమర్ధంగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లిష్ స్టార్ పేస్ ద్వయం అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను గతానికి భిన్నంగా ఆత్మవిశ్వాసంతో ఆడిన విరాట్ ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లలో తాను ఒకడినని ఘనంగా చాటిచెప్పాడు. పేస్ పిచ్‌లకు స్వర్గధామమైన ఇంగ్లండ్ పిచ్‌లపై పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.

కెప్టెన్‌గా వైఫల్యం: బ్యాటింగ్‌లో అదరగొట్టిన విరాట్..కెప్టెన్‌గా జట్టుకు విజయాలు అందించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఐదు టెస్ట్‌ల్లో ప్రత్యర్థి కెప్టెన్ జో రూట్‌కు టాస్ చేజార్చుకున్న కోహ్లీ.. మూడో టెస్ట్ మినహాయిస్తే మిగతా మ్యాచ్‌ల్లోనూ అదే ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌కు సన్నాహం నుంచి మొదలుపెడితే..జట్టు ఎంపిక, ఓపెనర్ల పేలవ ప్రదర్శన, బ్యాట్స్‌మెన్ తడబాటు, బౌలర్ల నిలకడలేమి మొదలైనవి జట్టుకు కీలక కారణాలుగా మారాయి. చివరాఖరికి కోహ్లీ కేవలం బ్యాటింగ్‌కే పనికొస్తాడని, నాయకునిగా వ్యూహాలు రచించడంలో విఫలమయ్యాడని మాజీలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సమరంలో కొంత అనుకూలతలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పేస్ బౌలర్లు ఇషాంత్‌శర్మ(18), జస్‌ప్రీత్ బుమ్రా(16), మహమ్మద్ షమీ(14) అదరగొట్టారు. ఆఖరి టెస్ట్‌లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీరోచిత పోరాటం భారత బ్యాటింగ్‌కు ఢోకా లేదని చాటిచెబుతున్నది. అయినా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

కలిసిరాని ఎంపిక

వేదికను బట్టి జట్టును ఎంపిక చేయాల్సింది పోయి మ్యాచ్ మ్యాచ్‌కు ఆటగాళ్లను మార్చడం మొత్తానికే కొంపముంచింది. తొలి టెస్ట్‌లో పుజారను తప్పించడంతో మొదలై ఆఖరి టెస్ట్‌కు కరుణ్ నాయర్‌ను పక్కకుపెట్టడం వరకు సాగింది. స్పిన్‌కు అనుకూలించిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఏకైక స్పిన్నర్‌ను ఎంచుకోవడం ఒకటైతే..సీమ్ బౌలింగ్‌ను అనుకూలించిన లార్డ్స్ టెస్ట్‌లో అశ్విన్, చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవడం కొంపముంచింది. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌పై ఏ మాత్రం ప్రభావం చూపని కుల్దీప్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ..అతిగా అంచనాలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నట్టేట ముంచాడు. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో విఫలమై..జట్టు ఓటములకు కారణమయ్యాడు. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో ఐదు వికెట్లకు తోడు అర్ధసెంచరీ మినహాయిస్తే హార్దిక్ ప్రదర్శన దరిద్రంగా ఏడ్చింది. నాలుగు టెస్ట్‌ల్లో 164 పరుగులకు పరిమితమయ్యాడంటే పాండ్యా ఆట ఎలా ఉందో తెలుస్తుంది. ఆఖరి టెస్ట్‌లో ట్రిపుల్ సెంచురియన్ కరుణ్ నాయర్‌ను తప్పించి ఆంధ్ర కుర్రాడు హనుమ విహారికి అవకాశమిచ్చారు. తనకు దక్కిన చాన్స్‌ను విహారి రెండుచేతులా అందిపుచ్చుకుని కోహ్లీ నమ్మకం నిలబెట్టడం ఎంపికలో కొంతలో కొంత ఊరట.

ఓపెనింగ్ ఫ్లాప్

టెస్ట్‌ల్లో ఏ జట్టుకైనా శుభారంభం ముఖ్యం. ఓపెనర్లు అందించే ఆరంభాన్ని బట్టి స్కోర్లు ఆధారపడి ఉంటాయి. ఓపెనర్లు విఫలమైతే..ఆ భారమంతా మిడిలార్డర్‌పై పడుతుంది. దీంతో ఒత్తిడికిలోనై స్వల్ప స్కోర్లకే వెనుదిరుగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల్లో టీమ్‌ఇండియాకు ఇదే అనుభవం ఎదురైంది. రెండు మ్యాచ్‌లాడిన మురళీ విజయ్ 26 పరుగులకు పరిమితమైతే..నేనింతే..నా ఆట ఇంతే అన్నట్లుగా వ్యవహరించే ధవన్..4 మ్యాచ్‌ల్లో 162 పరుగులు చేశాడు. మరోవైపు ఐదు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ ఓ సెంచరీతో 299 పరుగులు చేసి కొంతలో కొంత ఫర్వాలేదనిపించాడు. భారత్ తరఫున కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అప్పటికే కౌంటీల్లో ఆడిన అనుభవమున్న ఛతేశ్వర్ పుజరాను తొలి టెస్ట్‌కు పక్కకు పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత మిగిలిన నాలుగు టెస్ట్‌లాడిన పుజార ఓ సెంచరీతో 278 పరుగులతో రాణించి తనేంటో నిరూపించాడు.

Related Stories: