రోడ్డుపై చాక్లెట్ ప్రవాహం

బెర్లిన్: చాక్లెట్‌ను చూస్తే చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరికీ నోరూరుతుంది. అలాంటి చాక్లెట్ రోడ్డుపై ఓ ప్రవాహంలా పారితే ఎలా ఉంటుంది.. జర్మనీలో అదే జరిగింది. ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో ట్యాంక్‌ను నింపుతుండగా.. అది కాస్తా ఓవర్ ఫ్లో అయింది. దీంతో ఆ చాక్లెట్ అంతా ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి దగ్గర్లోని రోడ్డుపై పారింది. అది చూసిన చాక్లెట్ లవర్స్ గుండె తరుక్కుపోయింది. ఆ స్థాయిలో చాక్లెట్ వృథాగా రోడ్డుపై పోవడం చూసి బాధపడ్డారు. జర్మనీలోని వెస్టోనెన్‌లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. పది చదరపు మీటర్ల మేర పారిన చాక్లెట్‌ను క్లీన్ చేయడానికి స్థానిక సిబ్బంది చాలానే కష్టపడాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఆ రోడ్డును రెండు గంటల పాటు మూసేసి వేడి నీళ్ల సాయంతో క్లీన్ చేశారు. ఈ ప్రమాదం తర్వాత రెండు రోజుల పాటు చాక్లెట్ ఫ్యాక్టరీని మూసేశారు. క్రిస్మస్ దగ్గర పడిన సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే తమకు తీరని నష్టం జరిగేదని ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పింది. యూరప్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో పోలాండ్‌లో ట్యాంకర్ బోల్తా పడటంతో ఏకంగా 12 టన్నుల చాక్లెట్ రోడ్డు పాలైంది.

Related Stories: