టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూత

ముంబై: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ ఇకలేరు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాడేకర్ (77) బుధవారం కన్నుమూశారు. దక్షిణముంబైలోని జస్లోక్ దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య రేఖ, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. 1971 కాలంలో టీమ్‌ఇండియాకు ఇంగ్లండ్, వెస్టిండీస్ గడ్డపై తొలి విజయాన్ని రుచి చూపెట్టిన సారథిగా రికార్డులకెక్కిన వాడేకర్.. భారత్ తరఫున 37 టెస్టులు ఆడారు. సెంచరీతో కలిపి 2,113 పరుగులు చేశారు. అలాగే టీమ్‌ఇండియాకు తొలి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ముంబైకర్.. రెండు మ్యాచ్‌లు ఆడారు. 90ల్లో అజారుద్దీన్ నాయకత్వంలోని జట్టుకు మేనేజర్‌గా సేవలందించారు. తర్వాత చీఫ్ సెలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్ర‌ముఖుల నివాళి

1941లో జన్మించిన అజిత్‌ లక్ష్మణ్‌ వాడేకర్‌ 1966-74 మధ్య భారత జట్టుకు ఆడారు. భారత్‌కు వన్డేల్లో తొలి కెప్టెన్‌ అయిన అజిత్‌ను ప్రభుత్వం అర్జున (1967), పద్మశ్రీ (1972) అవార్డులతో సత్కరించింది. వాడేకర్‌ మృతితో క్రీడాలోకం తీవ్ర‌ దిగ్ర్భాంతి చెందింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బీసీసీఐతోపాటు మాజీ క్రికెట‌ర్లు బిషన్‌ సింగ్ బేడీ, సునీల్ గావాస్కర్‌, కపిల్‌ దేవ్‌, సచిన్ టెండూల్క‌ర్‌, అజారుద్దీన్‌, ప్ర‌ధాన కోచ్‌ రవిశాస్త్రి, వ్యాఖ్యాత హర్షాభోగ్లే, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా, సంజ‌య్ మంజ్రేక‌ర్‌, అనురాగ్ ఠాకూర్‌, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తదితరులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.

Related Stories: