చేపపిల్లల పంపిణీ లక్ష్యం.. 77 కోట్లు

-ఇప్పటికే 3,142 చెరువుల్లో పంపిణీ పూర్తి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మత్స్యశాఖ ఈ ఏడాది (2018-19) మూడో విడుత రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడుత 20 కోట్లు, రెండో విడుత 51 కోట్ల చేపపిల్లలను 21,569 చెరువుల్లో ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మూడో విడుతలో 77 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలను రూపొందించి అమలుచేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 3,142 చెరువుల్లో 11.40 కోట్ల చేపపిల్లల పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లు తక్కువ సైజున్న పిల్లలను సరఫరా చేయడంతో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వాటి పంపిణీని నిలిపివేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని నిర్ణయించడంతో మూడో విడుత పంపిణీ పుంజుకోలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంపై కాంట్రాక్టు పొందిన చేపపిల్లల సీడ్ ఏజెన్సీలతో చర్చించామని, త్వరలోనే పంపిణీని వేగవంతం చేస్తామన్నారు.