తల్లి పేరూ.. పెట్టొచ్చు!

-పాన్ కార్డు దరఖాస్తులపై ఐటీ శాఖ నిర్ణయం -డిసెంబర్ 5 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, నవంబర్ 20: పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డు దరఖాస్తు నిబంధనలను ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సవరించింది. ప్రస్తుతం తల్లి మాత్రమే ఉన్న అభ్యర్థులు.. తమ పాన్ కార్డు అప్లికేషన్ ఫారాల్లో తండ్రి పేరుకు బదులుగా తల్లి పేరును పేర్కొనవచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ నియమాలను సవరిస్తూ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పాన్ కార్డును కోరుతూ ఐటీ శాఖకు దరఖాస్తు పెట్టుకున్నవారు తమ తండ్రి పేరునే ఫారాల్లో పెట్టాల్సి వస్తున్నది. ఇది తప్పనిసరి నిబంధన. ఈ క్రమంలో ఇకపై అమ్మ పేరునూ పెట్టుకునేలా అవకాశాన్నిచ్చింది సీబీడీటీ. కొత్త మార్గదర్శకాలు వచ్చే నెల (డిసెంబర్) 5 నుంచి అమల్లోకి రానున్నాయి. తండ్రి చనిపోయినవారు లేదా తండ్రి నుంచి విడిపోయినవారు తమ పాన్ కార్డుల్లో తల్లి పేరును పెట్టుకోవాలనుకుంటున్నారని, వారందరి కోరికల్ని మన్నించి సీబీడీటీ తగు నిర్ణయం తీసుకున్నదని నంగియా అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్ సూరజ్ నంగియా అభిప్రాయపడ్డారు.

ఇదిలావుంటే ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిపే సంస్థలు పాన్ కార్డును కలిగి ఉండాల్సిందేనని కూడా తాజా నోటిఫికేషన్‌లో సీబీడీటీ ప్రకటించింది. ఈ మదింపు సంవత్సరానికిగాను మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనివల్ల పన్ను ఎగవేతల్ని నిరోధించడమేగాక, పన్ను వసూళ్లు పెరిగే వీలుందని నంగియా అన్నారు.