అల్లుడిని హతమార్చిన మామ..

జనగామ: కుటుంబ కలహాలతో అల్లుడిని మామ హతమార్చిన ఘటన చీటకోడూరు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన గంధమల్ల ఉదయ్(25) జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన గంధమల్ల ఎల్లేశ్ కూతురు మౌనిక ప్రేమించుకుని యేడాది క్రితం వివాహం చేసుకున్నారు. ఇరువురు తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి జీవితం కొనసాగిస్తున్న సందర్భంగా రెండు నెలల క్రితం మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో మౌనిక రెండు నెలల నుంచి తల్లిగారి ఊరైన చీటకోడూరులో ఉంటోంది.

అనంతరం ఉదయ్ అప్పుడప్పుడు మౌనిక వద్దకు వస్తుండడంతో అత్తమామలు రావొద్దని హెచ్చరించారు. దీనిపై ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. పెద్దమనుషుల నిర్ణయం ప్రకారం రూ.లక్షా 20 వేలు మౌనికకు ఇవ్వాలని ఉదయ్‌ను కోరారు. దీనిని ఉదయ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉదయ్ ఆదివారం మధ్యరాత్రి చీటకోడూరులో ఉంటున్న మౌనిక వద్దకు వచ్చాడు. గమనించిన మామ ఎల్లేశ్, బావమరిది పవన్ ఎందుకు వచ్చావని.. ఉదయ్‌ను ప్రశ్నించారు. దీంతో ఉదయ్ వారితో ఘర్షణ పడగా ఆగ్రహంతో మామ ఎల్లేశ్ గొడ్డలితో ఉదయ్ మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న జనగామ ఏసీపీ బాపురెడ్డి ఇవాళ ఉదయం సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Related Stories: