కాంగ్రెస్ నాయకులకు షాక్

కరీంనగర్ రూరల్ : కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నాయకులకు ప్రజలనుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటును మీరెందుకు ఇవ్వలేకపోయారంటూ రైతులనుంచి వచ్చిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కరువైంది. బతుకమ్మ చీరలకు అడ్డు పడడం సబబేనా? అంటూ మహిళలు ప్రశ్నిచడంతో నాయకులు షాక్ గురైన ఘటన కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో చోటుచేసుకుంది. నగునూరు గ్రామంలో గురువారం జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహరావు, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు నేరుగా ప్రశ్నల వర్షం కురించారు. ప్రసంగంలో భాగంగా టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన అమిరిశెట్టి రాములు అనే రైతు లేచి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నదనీ, ఏళ్ల తరబడి రాజ్యమేలిన మీరు ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయారో చెప్పాలని అడిగారు. రైతుల బాధలు మీకేమైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఈ వాదన సాగుతున్న సమయంలో అక్కడే ఉన్న కొంత మంది కాంగ్రెస్ నాయకులు రాములను పక్కకు తీసుకెళ్లారు. అనంతరం పోచయ్య అనే రైతు లేచి, గ్రామంలోని రోడ్లను తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభివృద్ధిచేశారనీ, మీరు ఎంపీగా ఉన్న సమయంలో గ్రామంలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. గ్రామానికి చెందిన రవితేజ్ అనే వ్యక్తి తమ గ్రామానికి తాజా మాజీ ఎమ్మెల్యే రూ.40 కోట్లను మంజూరు చేసి పలు అభివృద్ధి పనులు చేశారని, రోడ్ల నిర్మాణాలు పూర్తిచేశారనీ, మరి మీరేమి చేశారో చెప్పాలంటూ నిలదీసారు. ఈ పరిస్థితిని గమనించి బయటకు వస్తున్న సమయంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు బతుకమ్మ చీరల ఇవ్వకుండా ఎందుకు అడ్డం పడ్డారంటూ పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న పొన్నం దాటవేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం ఆదిలోనే వివిధ వర్గాలనుంచి ప్రశ్నలు ఎదురుకావడంతో కాంగ్రెస్‌నాయకులు షాక్‌కు గురియ్యారు.
× RELATED విద్యుదాఘాతంతో గుడిసెలు దగ్ధం